
హత్య కేసులో ఇద్దరి అరెస్ట్
రాపూరు: మండలంలోని రాపూరులో జరిగిన శీనయ్య అనే వ్యక్తి హత్య కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాపూరు దళితవాడకు చెందిన లేబాకు శీనయ్య (28)కు పంగిలి గ్రామానికి చెందిన ధనమ్మతో 2022 సంవత్సరంలో వివాహమైంది. కాగా అప్పటికే ధనమ్మకు అదే గ్రామానికి చెందిన కూనిపోగు కల్యాణ్ అలియాస్ వెంకటరమణయ్యతో వివాహేతర సంబంధం ఉంది. పెళ్లి తర్వాత కూడా ఆ సంబంధం కొనసాగింది. దీంతో వారు ఎలాగైనా శీనయ్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. బుధవారం రాత్రి శీనయ్య మద్యం తాగి ఇంట్లో నిద్ర పోతుండగా ధనమ్మ కల్యాణ్‌కు ఫోన్ చేసి రమ్మని చెప్పింది. అతను తాడు, ఆటో గేర్ వైరు తీసుకొచ్చి శీనయ్య చేతులు, కాళ్లు కట్టేసి మెడపై ఆటో గేర్ వైరుతో ఊపిరాడకుండా హత్య చేశారు. సహజ మరణంగా చూపించేందుకు ప్రయత్నించారు. శీనయ్య మద్యం తాగి తలుపునకు కొట్టుకుని పడిపోయాడని అతని తల్లిదండ్రులకు ధనమ్మ గురువారం చెప్పి నమ్మించాలని చూసింది. శీనయ్య చెవి నుంచి రక్తం వచ్చి ఉండగా తల్లి రమణమ్మ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు ప్రారంభించారు. ధన మ్మ, కల్యాణ్‌ను శుక్రవారం సాయ ంత్రం డిగ్రీ కళాశాల వద్ద అరెస్ట్ చేసినట్లు సీఐ వివరించారు. ఈ సమావేశంలో ఎస్సై వెంకటరాజేష్ , కండలేరు డ్యామ్ ఎస్సై రామకృష్ణ పాల్గొన్నారు.