బడికి పోదాం | - | Sakshi
Sakshi News home page

బడికి పోదాం

Published Thu, Jun 13 2024 12:40 AM | Last Updated on Thu, Jun 13 2024 12:40 AM

బడికి పోదాం

వేసవి సెలవులు యాభై రోజుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ముందుగా నిర్దేశించిన తేదీ కాకుండా.. కొత్త ప్రభుత్వం కొలువుదీరడం కోసం ఒక్క రోజు ఆలస్యంగా బడులు తెరుచుకుంటున్నాయి. ఇన్నాళ్లు ఆట, పాటలు, అల్లరితో ఇళ్లల్లో సందడి చేసిన విద్యార్థులు గురువారం నుంచి బడి బాట పట్టనున్నారు. విద్యార్థులకు అందించే కానుక కిట్లను గత ప్రభుత్వం ముందస్తుగానే సిద్ధం చేసింది. పాఠశాలలు తెరిచిన రోజే వాటిని విద్యార్థులకు అందించనున్నారు. ఇప్పటికే కిట్లన్నీ పాఠశాలలకు చేర్చింది.

రెండు రోజుల్లో

పూర్తిస్థాయిలో అందజేస్తాం

విద్యార్థులకు రెండు మూడు రోజుల్లో విద్యాకానుక కిట్లును అందజేస్తాం. 100 శాతం పాఠ్య, నోటు పుస్తకాలు, బెల్టులు వచ్చాయి. 50 శాతం యూనిఫాం వచ్చింది. బ్యాగ్‌లు, బూట్లు 25 శాతం పాఠశాలలకు చేరాయి. మిగిలినవి ట్రాన్స్‌పోర్టులో ఉన్నాయి. వీటిని తెప్పించి రెండు రోజుల్లో పూర్తిగా అందజేస్తాం. ప్రస్తుతం ఉన్న వాటిని బడి తెరిచిన రోజే విద్యార్థులకు అందజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.

– పీవీజే రామారావు, డీఈఓ

నెల్లూరు (టౌన్‌): జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో గురువారం నుంచి కొత్త విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 24వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. సంప్రదాయంగా జూన్‌ 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కావాల్సి ఉండగా, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఒక్క రోజు ఆలస్యంగా 13వ తేదీ నుంచి పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. దీంతో విద్యార్థులకు బడి బాట పట్టేందుకు బ్యాగుల బూజు దులిపి సిద్ధమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు స్టూడెంట్స్‌ కిట్ల పేరుతో తొమ్మిది రకాల వస్తువులను అందజేయనున్నారు. ఇప్పటికే కొన్ని రకాల వస్తువులు జిల్లాలోని ఆయా మండల కేంద్రాలకు చేరాయి. అక్కడ నుంచి స్కూల్‌ కాంప్లెక్స్‌లకు చేర్చి నేరుగా పాఠశాలలకు అందజేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డిజిటల్‌ విద్య, ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తున్నారు. పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించారు. బాల, బాలికలకు సరిపడా మరుగుదొడ్లు, ఆర్వో ప్లాంట్లు, క్రీడా మైదానం, కుర్చీలు, బెంచీలు, గ్రీన్‌చాక్‌ బోర్డు, లైట్లు, ఫ్యాన్లు తదితర వాటిని ఏర్పాటు చేశారు.

జిల్లాలో 3.54 లక్షల మంది విద్యార్థులు

జిల్లాలో 3,200కు పైగా ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 3,54,104 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరూ పాఠశాలలు పునః ప్రారంభించనుండటంతో బడిబాట పట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1,74,660 మంది విద్యార్థులకు అందజేయనున్నారు. విద్యార్థులకు అందజేయనున్న విద్యాకానుక కిట్లలో యూనిఫాం 3 జతలు, బూట్లు, సాక్స్‌లు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగు, బెల్టు, టై తదితర వస్తువులను అందజేయనున్నారు. జిల్లాకు బ్యాగులు 16,304, 79,173 యూనిఫాంలు, 12,130 బూట్లు, 9,62,728 నోటు పుస్తకాలు, 1,22,147 బెల్టులు తదితర వస్తువులు జిల్లాకు చేరుకున్నాయి. మిగిలిన వస్తువులు నేడు, రేపో జిల్లాకు చేరుకున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

డిజిటల్‌ విద్య సాఫీగా సాగేనా?

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం అమలవుతున్న పలు పథకాలు నూతన విద్యాబోధన సాఫీగా సాగేనా అనుమానం విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో గోరుముద్ద, సీబీఎస్‌ఈ సిలబస్‌, ఇంగ్లిష్‌ మీడియం, విద్యాకానుక కిట్లు, బైజూస్‌ బోధన, వర్చువల్‌ విధానం, తదితర వాటిని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నాడు–నేడు తొలి విడతలో జిల్లాలో 1,059 పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించారు. నాడు–నేడు రెండో విడతలో మరో 1,150 పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ పథకాలతో పాటు విద్యా విధానం అమలవుతుందో లేదోనన్న అనుమానం ఉంది. తొలుత నుంచి చంద్రబాబు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నారు. నాడు–నేడు రెండో విడతలో జరుగుతున్న పాఠశాలలకు నిధులు విడుదల చేయాల్సి ఉంది. వీటన్నింటిని పూర్తి చేస్తారా లేక పెండింగ్‌లో పెడతారో వేచి చూడాల్సి ఉంది.

నేటి నుంచి తెరుచుకోనున్న

ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు

గత ప్రభుత్వ హయాంలోనే సిద్ధం చేసిన విద్యాకానుక

ఇప్పటికే ఆయా పాఠశాలలకు చేరిన కిట్లు

నేటి నుంచి 1,74,660 మంది

విద్యార్థులకు అందజేయనున్న వైనం

ప్రైవేట్‌ పాఠశాలల్లో

1,72,230 మంది విద్యార్థులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement