నేటి నుంచి ప్రైమ్‌ రిజిస్ట్రేషన్లు | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ప్రైమ్‌ రిజిస్ట్రేషన్లు

Published Tue, Nov 14 2023 12:46 AM

-

జిల్లాలోని 15 సబ్‌ రిజిస్ట్రార్‌

కార్యాలయాల్లో ప్రారంభం

నెల్లూరు సిటీ: తమ ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రజలు సులభంగా చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కార్డ్‌ ప్రైమ్‌ అనే కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. మంగళవారం నుంచి జిల్లాలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. జిల్లాలోని 15 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఈ విధానంలో రిజిస్ట్రేషన్లు నిర్వహించనున్నారు. ఇప్పటికే నంద్యాల, విశాఖ, అనకాపల్లి, తిరుపతి జిల్లాల్లో ప్రారంభించారు. కార్డ్‌ ప్రైమ్‌ విధానంపై జిల్లాలోని 15 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో విధులు నిర్వహించే సబ్‌ రిజిస్ట్రార్లు, సీనియర్‌ అసిస్టెంట్లకు అక్టోబర్‌ నెలలో విజయవాడలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విధానంలో రిజిస్ట్రేషన్లు త్వరగా పూర్తి కావడంతోపాటు సెక్యూరిటీ ఉంటుంది.

ఇక ఆన్‌లైన్‌లోనే..

ఇక రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల చుట్టూ తిరగడం, అధికారుల కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదు. తమ ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఇకపై ఆన్‌లైన్‌లో చేసుకునేందుకు ప్రభుత్వం కార్డ్‌ ప్రైమ్‌ విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు పెరిగిన నేపథ్యంలో సురక్షితంగా రిజిస్ట్రేషన్‌ జరిగేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుంది. ఆధార్‌ లింక్‌తో రిజిస్ట్రేషన్లు చేయడం ద్వారా తప్పుడు రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేయవచ్చు. రిజిస్ట్రేషన్‌లు చేయించుకోవాలనే వారు స్లాట్‌ బుకింగ్‌ చేసుకుని రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే పేమెంట్‌ చెల్లింపులు చేయవచ్చు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయిన తరువాత వ్యవసాయ భూములు ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవడానికి తహసీల్దార్‌ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. రిజిస్ట్రేషన్‌ పూర్తి కాగానే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్‌ కూడా కొత్త విధానంలో జరుగుతుంది. రిజిస్టర్‌ అయిన డాక్యుమెంట్‌లను స్థానిక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, సీఎస్‌సీ, మీసేవ కేంద్రాల్లో తీసుకోవచ్చు.

Advertisement
 
Advertisement
 
Advertisement