వరుణుడిపైనే ఆశలు | Sakshi
Sakshi News home page

వరుణుడిపైనే ఆశలు

Published Tue, Nov 14 2023 12:46 AM

- - Sakshi

ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందించే స్థాయిలో నీటి నిల్వలు లేవు. సోమశిల జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కూడా కొరవడింది. ఈ నేపథ్యంలో జిల్లాలో మొదటి పంటకు సాగునీరు అందించాల్సిన నేపథ్యంలో మంగళవారం జిల్లా సాగునీటి సలహామండలి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని ఆయకట్టు, సాగునీటి వినియోగానికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నారు.

సాక్షిప్రతినిధి, నెల్లూరు: జిల్లా జలనిధి సోమశిల జలాశయానికి పైతట్టు ప్రాంతమైన రాయలసీమలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరద జలాల లభ్యత లేకపోయింది. ప్రస్తుతం సోమశిల జలాశయంలో 29.756 టీఎంసీల నీటి నిల్వ ఉండగా రాయలసీమ ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలకు 125 క్యూసెక్కులు మాత్రమే ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఈ ఏడాది వర్షాకాలంలో ఆశించిన మేర వరద జలాలు జలాశయానికి చేరుకోలేదు. దీంతోపాటు జిల్లాలో కూడా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చెరువుల్లో నీటి నిల్వలు కూడా తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో కురిసే వర్షాలపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు.

కండలేరులో..

ప్రస్తుతం కండలేరు జలాశయంలో 11.255 టీఎంసీల నీటి నిల్వ ఉండగా ఆ జలాశయం పరిధిలో తాగునీరు, ఇతర అవసరాలకు 5 టీఎంసీలు వినియోగిస్తే, మిగిలిన 6.255 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంటుంది. పెన్నార్‌ డెల్టా పరిధిలో గల కనిగిరి, సర్వేపల్లి రిజర్వాయర్లలో దాదాపు 2 టీఎంసీల నీటి లభ్యత ఉంది. వాటిని కలుపుకుంటే 8.255 టీఎంసీలు మాత్రమే సాగునీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి అవసరాలకు మాత్రమే అధిక ప్రాధాన్యం ఉంటుంది. రాపూరు, పొదలకూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, తిరుపతి పట్టణ తాగునీటి అవసరాలకు పోను కండలేరు పరిధిలో గల చెరువులు, పాడి పశువుల నీటి అవసరాలకు 3 టీఎంసీలు, తాగునీటి పథకాలకు 0.4 టీఎంసీలు, పరిశ్రమలకు 1.2 టీఎంసీలు ఇవ్వాల్సిన నేపథ్యంలో కండలేరుకు దాదాపు 8 టీఎంసీల నీటిని సోమశిల నుంచి సరఫరా చేయాల్సిన అవసరం ఉంది.

మొదటి పంటకు..

గతేడాది మొదటి(రబీ) పంటకు 5.51 లక్షల ఎకరాలకు నాడు ఐఏబీ సమావేశంలో సాగునీరు అందించేలా, అందుకు 51 టీఎంసీల నీటి వినియోగాన్ని తీర్మానించగా 39.2 టీఎంసీలతో 4,63,060 ఎకరాల్లో రైతులు పంటలు పండించుకున్నారు. ఇందుకు సంబంధించి పెన్నార్‌ డెల్టాలో 2.47 లక్షల ఎకరాలకు 24.7 టీఎంసీలు వినియోగించారు. కనుపూరుకాలువ పరిధిలో 66 వేల ఎకరాలకు 6.6 టీఎంసీలు, కావలి కాలువ పరిధిలో ఆయకట్టుకు 12.4 టీఎంసీలు, ఉత్తర కాలువ పరిధిలోని 50,515 ఎకరాలకు 7.2 టీఎంసీలు, దక్షిణ కాలువ పరిధిలోని 38,410 ఎకరాలకు 4.2 టీఎంసీల నీటిని వినియోగించారు.

రెండో పంటకు..

అలాగే గతేడాది రెండో పంట(ఖరీఫ్‌)కు సంబంధించి జిల్లాలో 2.85 లక్షల ఎకరాలకు జిల్లా సాగునీటి సల హా మండలి సమావేశంలో 32 టీఎంసీలు వినియోగించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ సీజన్‌లో 3,11,239 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేసుకోగా, 37.5 టీఎంసీల నీటిని వినియోగించుకున్నారు.

సోమశిల జలాశయం

సోమశిల జలాలకు ప్రాధాన్యం

వర్షమే ఆధారం

గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం జలాశయానికి వరద ప్రవాహం కొరవడింది. జిల్లాలో జలాశయం ప్రాజెక్ట్‌ నివేదిక ప్రకారం వృద్ధి చెందిన ఆయకట్టుతో కలిపి 5.51 లక్షల ఎకరాలకు గాను 63.789 టీఎంసీల నీరు అవసరం ఉంది. పూర్తి ఆయకట్టుకు నీరు అందించాలంటే నవంబర్‌ మాసం చివరి వారంలో వర్షాలు పడే అవకాశాల మీదే ఆధారపడాల్సి ఉంది. దీనికితోడు కర్ణాటక రాష్ట్రంలో కురిసే వర్షాల వల్ల కృష్ణానదికి ఆశించిన మేర వరద జలాలు వస్తే పోతిరెడ్డిపాడు ద్వారా సోమశిలకు నీటి లభ్యత ఉంటుంది. ఇటు రాయలసీమ ప్రాంతాల్లో కురిసే వర్షాలకు తోడు కృష్ణానది జలాలతో సోమశిల జలాశయానికి నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో వరద జలాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొదటి పంట సీజన్‌ డిసెంబర్‌ మాసంలో ప్రారంభించుకుంటే జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల పరిధిలో సాగునీటికి ఢోకా ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐఏబీ సమావేశంలో తీసుకునే నిర్ణయం మేరకు సాగునీటి విడుదల ఉంటుందని అధికారులు తెలిపారు.

నేడు ఐఏబీ సమావేశంలో సాగునీటి విడుదలపై చర్చ

సోమశిల జలాశయంలో

29.756 టీఎంసీలు

కండలేరులో 11.255 టీఎంసీలు

తాగునీటి అవసరాలకు అధిక ప్రాధాన్యం

జిల్లాలో తాగునీటి అవసరాలకు సోమశిల జలాశయమే ఆధారం. జలాశయం నుంచి రోజుకు దాదాపు 350 క్యూసెక్కుల నీరు తాగునీరు తదితరాల వినియోగానికి అవసరమవుతుంది. ఇలా ఏడాదిలో దాదాపు 10 నెలలపాటు జలాశయం నుంచి నీరు వినియోగించుకోవాల్సిఉంది. జలాశయంలోని దాదాపు 7.5 టీఎంసీల నీటిని సోమశిల దిగువ ప్రాంతాల చెరువులు, తాగునీటి అవసరాలకు కేటాయించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం జలాశయంలో ఉన్న 29.756 టీఎంసీల్లో డెడ్‌ స్టోరేజ్‌, నీటిఆవిరి కలిపి 12 టీఎంసీలు పోను నికర లభ్యత 17.8 టీఎంసీల నుంచి జిల్లా తాగునీటి అవసరాలకు 7.5 టీఎంసీలు వినియోగించాల్సిఉంది.

1/1

Advertisement
 
Advertisement