అంతులేని సుధీర్‌ గ్యాంగ్‌ మోసాలు | - | Sakshi
Sakshi News home page

అంతులేని సుధీర్‌ గ్యాంగ్‌ మోసాలు

Published Tue, Nov 7 2023 12:28 AM | Last Updated on Tue, Nov 7 2023 12:28 AM

ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేస్తున్న బాధితులు  - Sakshi

నెల్లూరు(క్రైమ్‌): కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనలో ప్రధాన నిందితుడు దేవరకొండ సుఽధీర్‌ అలియాస్‌ అజయ్‌రెడ్డి, అతని గ్యాంగ్‌ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తక్కువ ధరకే బంగారం, భూములు, రెట్టింపు నగదు పేరుతో మోసాలు, బెదిరింపులపై ఫిర్యాదులు అందుతున్నాయి. గత నెల 30వ తేదీన గుంటూరు, విజయవాడ, జిల్లాలోని ముత్తుకూరు మండలానికి చెందిన ముగ్గురు బాధితులు స్పందన కార్యక్రమంలో సుధీర్‌ మోసాలపై ఫిర్యాదులు చేశారు. తాజాగా భీమవరానికి చెందిన కే నారాయణదాస్‌, గుంటూరు జిల్లా తెనాలి మండలానికి చెందిన ఏ సుధీర్‌, అదే జిల్లాకు చెందిన పీ నరసింహులు, విజయలక్ష్మి, తెలంగాణ రాష్ట్రం జగిత్యాలకు చెందిన రాజేష్‌ స్పందనలో సుధీర్‌.. అతని గ్యాంగ్‌ మోసాలపై ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారు.

చంపుతామని బెదిరింపులు

భీమవరానికి చెందిన కె.నారాయణదాస్‌, వీఎస్‌ఎస్‌ సుధీర్‌ వ్యవసాయం చేసేందుకు తక్కువ ధరలో పొలం కోసం వెతుకుతుండగా బ్రోకర్‌ ద్వారా దేవరకొండ సుధీర్‌ పరిచయమయ్యాడు. తనకు తెలిసిన రైతుల వద్ద 70 ఎకరాల పొలం ఉందని, ఎకరం రూ.3 లక్షలకు ఇస్తానని సుధీర్‌ వారిని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన నారాయణదాస్‌, సుధీర్‌ పొలం కోసం రూ.96 లక్షలు ఇచ్చారు. నెల రోజుల తర్వాత పొలం అమ్మేందుకు రైతులు నిరాకరించారని సుధీర్‌ చెప్పాడు. దీంతో తాము ఇచ్చిన నగదు ఇవ్వాలని సుధీర్‌ను కోరగా రూ.2 వేల నోట్లు ఇస్తాం పది రోజుల తర్వాత రండి అని చెప్పాడు. వారు పది రోజుల తర్వాత కావలిలోని సుధీర్‌ ఇంటికి వెళ్లి డబ్బులు అడుగగా, తనను డబ్బులు అడిగినా, పోలీసుల వద్దకు వెళ్లినా చంపుతానని బెదిరిస్తున్నాడని ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

పోలీసుల అవతారమెత్తి..

గుంటూరు జిల్లా తెనాలి మండలానికి చెందిన ఎ.సుధీర్‌కు మొహ్మద్‌ జియావుల్‌ హక్‌తో పరిచయమై అది కాస్తా స్నేహంగా మారింది. సుధీర్‌ బంగారు చైన్‌ చేయించుకోవాలని తెలుపగా కావలిలో బంగారం తక్కువకు వస్తుందని కిషోర్‌ అలియాస్‌ మహేంద్రరెడ్డిని పరిచయం చేశాడు. మహేంద్రరెడ్డి తమ వద్ద 100 గ్రాముల బంగారం బిస్కెట్లు ఉన్నాయని, చైన్నె వస్తే ఇస్తామని తెలపడంతో సుధీర్‌ చైన్నెకు వెళ్లాడు. 150 గ్రాముల బంగారు బిస్కెట్‌ అని ఇవ్వగా, దానిని పరిశీలిస్తే 60 గ్రాములని తేలింది. దీనిపై సుధీర్‌ ప్రశ్నించగా త్వరలో ఇచ్చే బంగారంతో 90 గ్రాములు కలిపి ఇస్తామని తెలిపాడు. దీంతో సుఽధీర్‌ రెండోసారి డబ్బులతో చైన్నెకు వెళ్లగా, మహేంద్రరెడ్డి బంగారం తన మనిషికి ఇచ్చి సుధీర్‌ వెంట పంపాడు. సింగరాయకొండ సమీపంలో మహేంద్రరెడ్డి అతని స్నేహితులు పోలీసుల అవతారమెత్తి బంగారం తీసుకుని వెళుతున్న వ్యక్తిని పట్టుకుని తమ వెంట తీసుకెళ్లారు. అప్పటి నుంచి మహేంద్రరెడ్డి ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. మొత్తం రూ.21 లక్షలు ఇవ్వాల్సి ఉండగా, కొద్దిరోజుల తర్వాత రూ.3 లక్షల విలువ చేసే బంగారం ఇచ్చి మిగిలిన డబ్బులు ఇవ్వడం లేదు.

తక్కువ ధరకే బంగారం ఇస్తామని..

గుంటూరు జిల్లాకు చెందిన నరసింహులు, విజయలక్ష్మిలను తక్కువ ధరకే బంగారం ఇస్తామని సుధీర్‌, ఖాజావలి నమ్మించారు. వారు తమ ఇంటిని అమ్మి రూ.30 లక్షలు నిందితులకు ఇచ్చారు. ఇంకో రూ.15 లక్షలు ఇస్తే బంగారం ఇస్తామని చెప్పడంతో ఆ డబ్బులు సైతం ఇచ్చారు. నగదు పూర్తిగా ముట్టాక బంగారం తీసుకొని వస్తుండగా పోలీసులు పట్టుకున్నారని సుధీర్‌, ఖాజావలి బాధితులను మోసగించారు.

బంగారం పేరిట మోసగించారు

తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాకు చెందిన ఎ.రాజేష్‌కు ఏడాది క్రితం ఫోన్‌లో సుధీర్‌ పరిచయమయ్యాడు. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని కావలికి చెందిన మనోహర్‌రెడ్డిని పరిచయం చేసి రూ.10 లక్షలు తీసుకున్నారు. చౌదరి అనే వ్యక్తి ఇంకా డబ్బులు ఎక్కువ కావాలని రూ.3.13 లక్షలు తీసుకున్నాడు. ఇప్పటి వరకు బంగారం ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వమని గట్టిగా నిలదీయగా చంపేస్తానని బెదిరిస్తున్నారు. నిందితులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులంతా ఎస్పీని కోరారు.

ఒక్కొక్కటిగా వెలుగులోకి..

స్పందనలో ఫిర్యాదుల పరంపర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement