రెండో పంటకు ఇబ్బంది లేకుండా..

కండలేరు జలాశయం (ఫైల్‌)  - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో రెండో పంటకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. వేసవిని దృష్టిలో పెట్టుకుని సోమశిల, కండలేరు రెండు జలాశయాల్లో ఉన్న నీటి లభ్యత ఆధారంగా రెండో పంటకు నీరందించేలా చర్యలు చేపట్టారు.

జిల్లాలోని ప్రధాన జలాశయమైన సోమశిలలో ప్రస్తుతం నీటి నిల్వ 54 టీఎంసీలు. కండలేరులో 41 టీఎంసీల నీరు ఉంది. డెడ్‌ స్టోరేజీ, లైవ్‌ స్టోరేజీ, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల ఆయకట్టు పరిధిలో రెండో పంటకి నీటి కేటాయింపులు చేయనున్నారు.

● రైతుల పంటలకు, సంబంధిత ఆయకట్టుకు నీటిని అందించే సాగునీటి సలహా మండలి సమావేశాన్ని శుక్రవారం ఉదయం 10 గంటలకు నెల్లూరులోని నూతన జెడ్పీ సమావేశ మందిరంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈ పి.కృష్ణమోహన్‌ అధ్యక్షతన నిర్వహించనున్నారు. దీనికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ప్రజా ప్రతినిధులు, రైతు నాయకులు హాజరై నీటి కేటాయింపుల ప్రతిపాదనను ఆమోదించనున్నారు.

సోమశిల పరిధిలో..

ప్రస్తుతం సోమశిల జలాశయంలో ఉన్న నీటి నిల్వ ఆధారంగా తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందుబాటులో ఉన్న నీటిని ప్రతిపాదించనున్నారు. ప్రస్తుత సీజన్‌లో సాగులో ఉన్న పంటలకు 4.81 టీఎంసీలు, మిగిలిన 50.20 టీఎంసీల్లో డెడ్‌ స్టోరేజీ, నీటి ఆవిరి, నెల్లూరు కార్పొరేషన్‌కు, కావలి, అల్లూరు తదితర తాగునీటి అవసరాలకు పోనూ 32 టీఎంసీలుంటాయి. ఈ నీటిని, కనిగిరి, సర్వేపల్లి రిజర్వాయర్లలో లభ్యమయ్యే 1.500 టీఎంసీలను రెండో పంటకు వివిధ కాలువల ద్వారా 2,85,000 ఎకరాలకు అందించేలా ప్రణాళికలు చేశారు.

కండలేరు పరిధిలో..

కండలేరు జలాశయానికి సంబంధించి డెడ్‌ స్టోరేజీ, లైవ్‌ స్టోరేజీ, చైన్నె తాగునీటి అవసరాలు, రాపూరు, పొదలకూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, శ్రీకాళహస్తి, తిరుపతి తాగునీటి అవసరాలకు, స్వర్ణముఖి బ్యారేజీ నీటి అవసరాలకు, ఆవిరి శాతం, పరిశ్రమలకు 27.949 టీఎంసీల నీరు అవసరం కాగా మిగిలిన 14 టీఎంసీల నీటిని నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని 1.40 లక్షల ఎకరాలకు రెండో పంట కింద అందించనున్నారు.

కేటాయింపులిలా..

కాలువ అభివృద్ధి చెందిన రెండో పంటకు ప్రతిపాదించిన

ఆయకట్టు ప్రతిపాదించిన నీటి పరిమాణం

(ఎకరాల్లో) ఆయకట్టు టీఎంసీల్లో

పెన్నా డెల్టా 2,47,000 1,80,000 20.230

కనుపూరు కాలువ 66,000 30,000 3.3

కావలి కాలువ 1,24,000 30,000 3

జీకేఎన్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌) 72,000 25,000 2.8

దక్షిణ కాలువ 24,000 20,000 2.2

సాగునీరిచ్చేందుకు అధికారుల చర్యలు

నేడు జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం

హాజరుకానున్న మంత్రి కాకాణి,

ప్రజాప్రతినిధులు

నీటిని వృథా చేయొద్దు

రైతులు నీటిని వృథా చేయొద్దు, వరితోపాటు ఇతర పంటలు వేస్తే మంచిది. నాలుగేళ్లుగా రెండో పంటకు క్రమం తప్పకుండా నీరిస్తున్నాం. రెండు బ్యారేజీల నిర్మాణాలు, నీటి క్రమబద్ధీకరణ వల్ల రైతులకు ఎంతో లాభం. అధికారులు నిర్దేశించిన మేరకు పంటలను వేసుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలి.

– పి.కృష్ణమోహన్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈ

Read latest SPSR Nellore News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top