విలియమ్సన్‌ డబుల్‌ సెంచరీ.. ఫాస్టెస్ట్‌ రికార్డు

Williamson Rewrites Record Books En Route 7000 Test Runs - Sakshi

క్రిస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మళ్లీ డబుల్‌ సెంచరీ సాధించాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ద్విశతకం సాధించిన విలియమ్సన్‌.. తాజాగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో డబుల్‌ సెంచరీతో మెరిశాడు. పాక్‌తో తొలి ఇన్నింగ్స్‌లో 364 బంతుల్లో 28 ఫోర్లతో 238 పరుగులు సాధించాడు. ఇది విలియమ్సన్‌ టెస్టు కెరీర్‌లో నాల్గో డబుల్‌ సెంచరీ.  112 పరుగుల ఓవర్‌నైట్‌  స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన విలియమ్సన్‌ దుమ్మురేపాడు.  పాక్‌ బౌలర్లను ఉతికి ఆరేస్తూ డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. అతనికి జతగా హెన్నీ నికోలస్‌(157) భారీ సెంచరీ సాధించాడు. దాంతో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను 659/6 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. (టెస్టు సిరీస్‌: కేఎల్‌ రాహుల్‌ అవుట్‌)

ఫాస్టెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా రికార్డు
కేన్‌ విలియమ్సన్‌ డబుల్‌ సెంచరీ సాధించడంతో తన టెస్టు కెరీర్‌లో ఏడువేల పరుగుల మైలురాయిని చేరాడు. అదే సమయంలో ఈ ఘనతను వేగంగా సాధించిన కివీస్‌ బ్యాట్స్‌మన్‌గా కేన్‌ రికార్డు సాధించాడు. ఈ క్రమంలోనే రాస్‌ టేలర్‌ రికార్డును విలియమ్సన్‌ అధిగమించాడు. టేలర్‌ 96 మ్యాచ్‌ల్లో ఏడువేల పరుగుల ఘనతను సాధించగా,  విలియమ్సన్‌ 83 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్‌ నమోదు చేశాడు. కాగా, కివీస్‌ తరుఫున ఏడువేల పరుగులు సాధించిన మూడో టెస్టు బ్యాట్స్‌మన్‌గా విలియమ్సన్‌ నిలిచాడు. టేలర్‌, స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ల తర్వాత ఏడువేల పరుగులు సాధించిన మూడో కివీస్‌ ఆటగాడు విలియమ్సన్‌ కావడం విశేషం. మరొకవైపు కివీస్‌ తరఫున వరుసగా మూడు సెంచరీలు సాధించిన నాల్గోబ్యాట్స్‌మన్‌గా విలియమ్సన్‌ గుర్తింపు పొందాడు.  అంతకుముందు మార్క్‌ బర్జెస్‌, టేలర్‌, టామ్‌ లాథమ్‌లు మాత్రమే న్యూజిలాండ్‌ తరఫున వరుసగా మూడు సెంచరీలు సాధించిన ఆటగాళ్లు. కాగా,  నాల్గో వికెట్‌కు నికోలస్‌తో కలిసి 369 పరుగుల భాగస్వామ్యాన్ని విలియమ్సన్‌ సాధించాడు. ఇది నాల్గో వికెట్‌కు కివీస్‌ అత్యధిక స్కోరు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top