T20 WC 2022- Rahul Dravid: జట్టు కూర్పు విషయంలో నేను, రోహిత్‌ పూర్తి క్లారిటీతో ఉన్నాం.. వాళ్లకు అవకాశం ఇస్తాం: ద్రవిడ్‌

T20 World Cup 2022: Rahul Dravid Says We Clear About Team Combination - Sakshi

T20 World Cup 2022- Rahul Dravid Comments: టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీలో ఘెర పరాభవం మూటగట్టుకుంది టీమిండియా. సెమీస్‌ కూడా చేరకుండానే ఐసీసీ మెగా ఈవెంట్‌ నుంచి నిష్క్రమించింది. ముఖ్యంగా పాకిస్తాన్‌ చేతిలో కనీవిని ఎరుగని రీతిలో ఓటమి అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. వెరసి ఈ కీలక టోర్నీ హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి, కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లికి చేదు అనుభవాన్ని మిగిల్చింది.

ఇక ప్రపంచకప్‌ టోర్నీ ముగిసిన తర్వాత రవిశాస్త్రి, కోహ్లి తమ పదవుల నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెడ్‌కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌, సారథిగా రోహిత్‌ శర్మ వారి స్థానాలను భర్తీ చేశారు. వీరిద్దరు బాధ్యతలు చేపట్టిన వెంటనే టోర్నీ రన్నరప్‌ న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. అంతేగాక వెస్టిండీస్‌తో సిరీస్‌ను కూడా 3-0 తేడాతో వైట్‌వాష్‌ చేసింది.

వెంకటేశ్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ వంటి యువ ఆటగాళ్లు మెరుగ్గా రాణించడం.. సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌ తదితర ఆటగాళ్లతో మిడిలార్డర్‌ పటిష్టంగా మారడం సానుకూల అంశాలుగా పరిణమించాయి. ఇదే ఉత్సాహంలో ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న వరల్డ్‌కప్‌-2022కు టీమిండియా సన్నద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో  జట్టు కూర్పు గురించి కోచ్‌ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ మేరకు వెస్టిండీస్‌ను వైట్‌వాష్‌ చేసిన అనంతరం ద్రవిడ్‌ మాట్లాడుతూ... ‘‘నేను, రోహిత్‌ శర్మ.. మేనేజ్‌మెంట్‌ ఈ విషయంలో పూర్తి స్పష్టతతో ఉన్నాం. కచ్చితంగా ఇదే ఫార్ములా ఫాలో అవ్వాలని ఏమీ లేదు. అయితే సమతుల్యమైన జట్టును సెట్‌ చేసుకోవడం ముఖ్యం.

అర్హుడైన ప్రతి ఒక్క ఆటగాడికి కచ్చితంగా అవకాశం ఇస్తాం. మెగా టోర్నీ నేపథ్యంలో జట్టులో స్థానం సంపాదించుకునే దిశగా వారు చేస్తున్న ప్రయత్నాలకు ఊతమిస్తాం’’ అని పేర్కొన్నాడు. కేవలం 15 మంది ఆటగాళ్లకే పరిమిత కాబోమని, వరల్డ్‌కప్‌నకు ముందు కీలక ఆటగాళ్లు కనీసం పది నుంచి 20 మ్యాచ్‌లు ఆడేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని వెల్లడించాడు. కాగా టీమిండియా ప్రస్తుతం శ్రీలంకతో టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

చదవండి: IND Vs SL T20 Series: టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ.. గాయంతో సూర్యకుమార్‌ ఔట్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top