ప్రియం గర్గ్‌-అభిషేక్‌ల పంచ్‌ అదిరింది

SRH Bank On Abhishek, Garg For Big Finish - Sakshi

దుబాయ్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 165  పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. జానీ బెయిర్‌స్టో పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. దాంతో క్రీజ్‌లోకి వచ్చిన మనీష్‌ పాండే బ్యాట్‌కు పనిచెప్పాడు. కాకపోతే మంచి టచ్‌లో ఉన్న సమయంలో మనీష్‌ పాండే(29; 21 బంతుల్లో 5 ఫోర్లు) ఔటయ్యాడు. శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో సామ్‌ కరాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దాంతో 47 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది.మరో 22 పరుగుల వ్యవధిలో డేవిడ్‌ వార్నర్‌(28; 29 బంతుల్లో 3 ఫోర్లు)ను డుప్లెసిస్‌ అద్భుతమైన క్యాచ్‌తో ఔట్‌ చేయగా, ఆపై వెంటనే కేన్‌ విలియమ్సన్‌ రనౌట్‌గా ఔటయ్యాడు. దాంతో 69 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆరెంజ్‌ ఆర్మీ.  

ప్రియం గర్గ్‌-అభిషేక్‌లు దుమ్ములేపారు..
ఆ సమమయంలో యువ ఆటగాళ్లు ప్రియం గర్గ్‌-అభిషేక్‌లు దుమ్ములేపారు. సీఎస్‌కే బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్న వీరిద్దరూ  76 పరుగులు జత చేశారు. అభిషేక్‌(31; 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఐదో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై  ప్రియం గర్గ్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కడవరకూ క్రీజ్‌లో ఉన్న ప్రియం గర్గ్‌ 26 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్‌తో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అబ్దుల్‌ సామద్‌ 8 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 164 పరుగులు చేసింది.సీఎస్‌కే బౌలర్లలో దీపక్‌ చాహర్‌ రెండు వికెట్లు సాధించగా, శార్దూల్‌ ఠాకూర్‌, పీయూష్‌ చావ్లాలు తలో వికెట్‌ తీశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top