ప్చ్‌.. సన్‌రైజర్స్‌ మళ్లీ ఓడింది

KKR Beat Sunrisers Hyderabad By 7 Wickets - Sakshi

అబుదాబి: ఐపీఎల్‌-13లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మళ్లీ ఓడింది. శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ సమష్టిగా విఫలమై పరాజయాన్ని చవిచూసింది. సాఫీగా సాగిపోయిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఖాతా తెరిచింది. కాగా, ఇది సన్‌రైజర్స్‌కు వరుసగా రెండో ఓటమి. ఆర్సీబీతో ఆడిన గత మ్యాచ్‌లో ఓడిన సన్‌రైజర్స్‌కు తాజా మ్యాచ్‌లో సైతం చుక్కెదురైంది. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 143 పరుగుల టార్గెట్‌ను కేకేఆర్‌ 18 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్‌ విజయంలో శుబ్‌మన్‌ గిల్‌( 70 నాటౌట్‌; 62 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా, నితీష్‌ రాణా(26; 13 బంతుల్లో 6 ఫోర్లు) మెరుపులు మెరిపించాడు.  ఇయాన్‌ మోర్గాన్‌(42 నాటౌట్; 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు‌) సహజసిద్ధంగా ఆడి జట్టు విజయంలో సహకరించాడు.(చదవండి: రైనా వైపు చూసే ప్రసక్తే లేదు: సీఎస్‌కే)

లక్ష్య ఛేదనలో కేకేఆర్‌ రెండో ఓవర్‌లోనే సునీల్‌ నరైన్‌ వికెట్‌ను కోల్పోయింది. ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి నరైన్‌ ఔటయ్యాడు. ఆపై గిల్‌కు రాణా జత కలిశాడు. వీరిద్దరూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. జట్టు స్కోరు 43 పరుగుల వద్ద ఉండగా కీపర్‌ సాహాకు క్యాచ్‌ ఇచ్చిన రాణా పెవిలియన్‌ చేరాడు. అనంతరం​ దినేశ్‌ కార్తీక్‌ డకౌట్‌ కావడంతో కేకేఆర్‌ 53 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. కానీ గిల్‌-ఇయాన్‌ మోర్గాన్‌లు సన్‌రైజర్స్‌ మరో అవకాశం ఇవ్వకుండా జట్టును గెలిపించారు. ఈ జోడి అజేయంగా 92 పరుగులు జోడించి విజయంలో కీలక పాత్ర పోషించారు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌ ఆదిలోనే జానీ బెయిర్‌ స్టో(5) వికెట్‌ను కోల్పోయింది. ప్యాట్స్‌ కమిన్స్‌ వేసిన నాల్గో ఓవర్‌ చివరి బంతికి బెయిర్‌ స్టో బౌల్డ్‌ అయ్యాడు. దాంతో ఎస్‌ఆర్‌హెచ్‌ 24 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో వార్నర్‌కు మనీష్‌ పాండే జత కలిశాడు. వీరిద్దరూ 35 పరుగులు జత చేసిన తర్వాత వార్నర్‌ సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి వార్నర్‌ పెవిలియన్‌ చేరాడు. దాంతో 59 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆపై పాండే-సాహాల జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది.  ఈ జోడి 62 పరుగులు చేసిన తర్వాత పాండే  ఔట్‌ కాగా, చివరి ఓవర్‌లో సాహా ఔటయ్యాడు.  కాగా, కేకేఆర్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ పరుగులు చేయడానికి అపసోపాలు పడింది. ఈ క్రమంలోనే 15 ఓవర్లు ముగిసే సరికి ఎస్‌ఆర్‌హెచ్‌ రెండు వికెట్లు నష్టానికి 99 పరుగులు చేసింది. ఇక స్లాగ్‌ ఓవర్లలో పరుగులు రావడం కష్టంగా మారింది. దాంతో ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. (చదవండి: ధోని ఆట చూడకండి: అజయ్‌ జడేజా)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top