India Vs England: 157 పరుగులు చేస్తే భారత్‌ జయభేరి

India Vs England: India Need 157 More To Win - Sakshi

ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 52/1

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు

నాటింగ్‌హామ్‌: తొలి టెస్టులో ఆఖరి రోజు భారత్‌ ఒక సెషన్‌ కుదురుగా ఆడితేచాలు ఇంగ్లండ్‌ పర్యటనలో శుభారంభం చేయొచ్చు. 209 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత్‌ ఆట నిలిచే సమయానికి పావువంతు స్కోరు చేసేసింది. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 52 పరుగులు చేసింది. ధాటిగా ఆడిన రాహుల్‌ (38 బంతుల్లో 26; 6 ఫోర్లు) నిష్క్రమించగా... రోహిత్‌ (12 బ్యాటింగ్‌), పుజారా (12 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఆదివారం ఇంకా 157 పరుగులు చేస్తే భారత్‌ జయభేరి మోగిస్తుంది.

అంతకుముందు 25/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్‌ జో రూట్‌ (172 బంతుల్లో 109; 14 ఫోర్లు) సెంచరీ సాధించాడు. ఇతన్ని శతక్కొట్టిన తర్వాత ఔట్‌ చేసిన బుమ్రా (5/64) మిగతా టాపార్డర్‌ను తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేర్చాడు. ఓపెనర్‌ సిబ్లీ (28; 2 ఫోర్లు), వన్‌డౌన్‌లో క్రాలీ (6) సహా లోయర్‌ ఆర్డర్‌లో స్యామ్‌ కరన్‌ (45 బంతుల్లో 32; 4 ఫోర్లు), బ్రాడ్‌ (0)లను బుమ్రా ఔట్‌ చేశాడు. మరోవైపు శార్దుల్‌... లారెన్స్‌ (25), బట్లర్‌ (17) వికెట్లను పడేశాడు. దీంతో ఇంగ్లండ్‌ వరుస విరామాల్లో క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. సిరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి.

స్కోరు వివరాలు 
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 183; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 278; ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: బర్న్స్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 18; సిబ్లీ (సి) పంత్‌ (బి) బుమ్రా 28; క్రాలీ (సి) పంత్‌ (బి) బుమ్రా 6; రూట్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 109; బెయిర్‌స్టో (సి) జడేజా (బి) సిరాజ్‌ 30; లారెన్స్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) శార్దుల్‌ 25; బట్లర్‌ (బి) శార్దుల్‌ 17; స్యామ్‌ కరన్‌ (సి) సిరాజ్‌ (బి) బుమ్రా 32; రాబిన్సన్‌ (సి) రహానే (బి)షమీ 15; బ్రాడ్‌ (బి) బుమ్రా 0; అండర్సన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (85.5 ఓవర్లలో ఆలౌట్‌) 303. వికెట్ల పతనం: 1–37, 2–46; 3–135, 4–177, 5–211, 6–237, 7–274, 8–295, 9–295, 10–303. బౌలింగ్‌: బుమ్రా 19–2–64–5; సిరాజ్‌ 25–3–84–2; షమీ 15.5–1–72–1; శా>ర్దుల్‌ 13–1–37–2; జడేజా 13–3–39–0. 
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) బట్లర్‌ (బి) బ్రాడ్‌ 26; రోహిత్‌ (బ్యాటింగ్‌) 12; పుజారా (బ్యాటింగ్‌) 12; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (14 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 52. వికెట్ల పతనం: 1–34. బౌలింగ్‌: అండర్సన్‌ 5–1–12–0, బ్రాడ్‌ 5–1–18–1, రాబిన్సన్‌ 4–0–21–0. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top