లారీల కోసం రాస్తారోకో
కొండపాక(గజ్వేల్): కొనుగోలు కేంద్రానికి లారీలు పంపించాలంటూ మండలంలోని దుద్దెడ శివారులోని రాజీవ్ రహదారిపై టోల్‌ప్లాజా వద్ద రైతులు రాస్తారోకో చేశారు. మర్పడ్గ, సిర్సనగండ్ల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాల్లో నింపి వారం రోజులు గడుస్తున్నా లారీలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్వాహకులను సంప్రదించగా పొంత న లేని సమాధానాలు చెప్పడంతో అన్నదాతలు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల్లో సుమారు మూడు వేల బస్తాల ధాన్యం సిద్దంగా ఉంది. ఈ సందర్భంగా రైతులు నర్సింహులు, కనకయ్య, శ్రీనివాస్‌రెడ్డి, సెల్ బాల్‌నర్సు, రాము లు తదితరులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి లారీలను పంపించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. వర్షం కురిస్తే ధాన్యం బస్తాలు తడిసిపోయే ప్రమాదం ఉందని వాపోయారు. రాస్తారోకో విషయాన్ని తెలుసుకున్న త్రీ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి విరమింపజేశారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు.
గజ్వేల్/గజ్వేల్‌రూరల్: ఆరుగాలం కష్టపడి సాగుచేసిన పంటలను విక్రయించేందుకు రైతులకు రోజుల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. తాము తీసుకువచ్చిన ధాన్యం ఎప్పుడు కొంటారంటూ రైతులు పలుచోట్ల శనివారం రోడ్లపై బైఠాయించి ధర్నాకు దిగారు. గజ్వేల్‌తో పాటు మండల పరిధిలోని అహ్మదీపూర్, జగదేవ్‌పూర్ మండలం మునిగడప గ్రామాల్లో అన్నదాతలు రోడ్లపై బైఠాయించి ఆందో ళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 50 రోజులుగా పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. మొక్కజొన్న, వరి ధాన్యం పరిస్థితి కూడా ఇలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికందిన పంటను విక్రయిద్దామనుకుంటే కొనుగోళ్లలో జాప్యంతో అవస్థలు పడుతున్నామని, ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు తమవంతు ఎప్పుడొస్తుందా.. అంటూ ఎదురు చూసి నిరాశతో వెనుతిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో అన్నదాతలు ఆందోళన విరమించారు. దీంతో రోడ్లపై గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ధాన్యం కొనండి మహాప్రభు!
మర్కూక్(గజ్వేల్): ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు లారీలు రాకపోవడంతో ధాన్యం ఎగుమతులు జరగడం లేదు. ఏదోలా రైతులు ట్రాక్టర్లు, లారీల్లో ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలిస్తే కూలీల కొరతతో రోజుల తరబడి వాహనాలతో పడిగాపులు కాస్తున్నారు. మండలంలోని నర్సన్నపేట సమీపంలోని రైస్‌మిల్లు వద్ద మూడు రోజులుగా ధాన్యం బస్తాలతో లారీలు, ట్రాక్టర్‌లు బారులు తీరాయి. ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అలాగే మండలంలోని అంగడికిష్టాపూర్ ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధర్నాకు దిగారు. ఐదు రోజుల నుంచి సెంటర్‌కు లారీలను పంపిచండం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నేల పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు చెప్పినా పట్టింకోవడంలేదని వాపోయారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపించి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ కొండల్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
కొమురవెల్లి(సిద్దిపేట): ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు గీస భిక్షపతి డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు, రైతులతో కలసి మండల కేంద్రంలో ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ అసమర్ధతవల్లే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలలో గన్నీ బ్యాగులు, ప్యాడీ క్లీనర్లు, లారీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సిద్దప్ప, నాయకులు ముత్యం నర్సింహులు, గొల్లపల్లి కిష్టయ్య, కనకచారి తదితరులు పాల్గొన్నారు.
వెల్లువెత్తిన నిరసనలు
రోడ్లపై బైఠాయించి అన్నదాతల ధర్నా
గంటల తరబడి
నిలిచిపోయిన వాహనాలు


