వర్గల్(గజ్వేల్): గౌరారం కావేరి యూనివర్సిటీలో టీజీ పీఎస్‌సీ డిపార్ట్‌మెంటల్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లుగా పరీక్షలు నిర్వహిస్తుండగా తొలిరోజు ఉదయం సెషన్‌లో 180 మందికి 141, మధ్యాహ్నం సెషన్‌లో 180కి 140 మంది హాజరైనట్లు యూనివర్సిటీ వీసీ డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద గౌరారం పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
రూ.70 వేల విరాళం
చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని గోనెపల్లిలో పోచమ్మ తల్లి ఉత్సవాలకు గాను గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు శనివారం రూ.70 వేలు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కూర మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణలో అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవడం అభినందనీయమన్నారు. సంఘం నాయకులు కమలాకర్‌చారి, సంతోష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఈకేవైసీ తప్పనిసరి
నంగునూరు(సిద్దిపేట): గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని ఇండేన్ గ్యాస్ నంగునూరు డీలర్ జయపాల్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు హరిణి గ్యాస్ కార్యాలయంలో వినియోగదారుల ఈకేవైసీ ప్రక్రియ చేపట్టామన్నారు. ఈకేవైసీ చేయించుకోకపోతే గ్యాస్ పంపిణీ నిలిచిపోతుందని చెప్పారు.


