కస్తూర్బాలో అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

కస్తూర్బాలో అడ్మిషన్లు

May 23 2026 9:29 AM | Updated on May 23 2026 9:29 AM

వర్గల్‌(గజ్వేల్‌): స్థానిక కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో 2026–27 విద్యాసంవత్సరం కోసం ఆరు, ఏడు తరగతులు, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఎంఎల్‌టీ గ్రూపులో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రత్యేకాధికారి రజిత తెలిపారు. ఆరోతరగతిలో 40, ఏడో తరగతిలో 13, ఎంఎల్‌టీలో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయని వివరించారు. అర్హులైన విద్యార్థినులు వచ్చే నెల 22లోగా నేరుగా వర్గల్‌ విద్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

విత్తన దుకాణాల్లో

టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

గజ్వేల్‌: పట్టణంలోని విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో ఏడీఏ బాబునాయక్‌, ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌, రాయపోల్‌ వ్యవసాయాధికారి నరేష్‌ సభ్యులుగా ఉన్న టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ శుక్రవారం తనిఖీలు చేపట్టింది. పట్టణంలోని జ్యోతి ఆగ్రో మార్కెటింగ్‌, ఆగ్రో రైతు సేవా కేంద్రం, వరలక్ష్మి, శ్రీసాయి ఫర్టిలైజర్‌ దుకాణాల్లో ఈ తనిఖీలు జరిగాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల లైసెన్స్‌లు, స్టాక్‌ రిజిష్టర్లు, బిల్లు బుక్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైసెన్స్‌ కలిగిన కంపెనీల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు మాత్రమే విక్రయించాలని, రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే..పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు అమ్మినా, కాలం చెల్లినవి అమ్మినా చర్యలు తప్పవన్నారు.

అంత్య పుష్కరాలకు

ప్రత్యేక బస్సులు

హుస్నాబాద్‌: సరస్వతి మాత అంత్య పుష్కరాలకు హుస్నాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్‌ వెంకన్న తెలిపారు. స్థానిక బస్టాండ్‌ నుంచి కాళేశ్వరంలో జరుగుతున్న అంత్య పుష్కరాలకు వయా కరీంనగర్‌ మీదుగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.

సాగులో మెలకువలు తప్పనిసరి

పరిశోధన శాస్త్రవేత్తలు

చిన్నకోడూరు(సిద్దిపేట): పంటల సాగులో మెలకువలు పాటించాలని పరిశోధన శాస్త్రవేత్తలు లక్ష్మమ్మ, ప్రధుమన్‌ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చర్లఅంకిరెడ్డిపల్లిలో భారతీయ నూనె గింజల సంస్థ ఆధ్వర్యంలో సమతుల్య ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ తక్కువ యూరియా వాడకంతో సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు నేల ఆరోగ్యాన్ని కాపాడవచ్చన్నారు. సాగులో సేంద్రియ పద్ధతులను ఉపయోగించాలన్నారు. పంట మార్పిడి చేయాలని సూచించారు. మట్టి పరీక్షలు తప్పనిసరిగా చేయించాలన్నారు. నూనె గింజల పరిశోధన సంస్థ అధికారి నిహారిక, ఏఈఓ, రైతులు పాల్గొన్నారు.

డీఆర్‌ఓగా నాగరాజమ్మ

సిద్దిపేటరూరల్‌: జిల్లా రెవెన్యూ అధికారిగా నాగరాజమ్మను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు జిల్లా భూసేకరణ ప్రత్యేక ఉపకలెక్టర్‌ యూనిట్‌ –2 విధులు నిర్వహిస్తూ ఇన్‌చార్జి డీఆర్‌ఓగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ ఉత్తర్వులతో నూతన డీఆర్‌ఓగా బాధ్యతలు చేపట్టనున్నారు.

కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌

చైర్మన్‌గా కరుణాకర్‌

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌గా మల్కగల్ల కరుణాకర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కరుణాకర్‌ గజ్వేల్‌ మండలం రిమ్మనగూడ గ్రామ సర్పంచ్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement