సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా ముందుకు సాగుతున్నామని కలెక్టర్ హైమావతి అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి సమావేశం కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతలో భాగంగా 766.81టన్నుల వ్యర్థాలను తొలగించామని, అలాగే 3,506 కార్యాలయ భవనాలను శుభ్రపరిచి, 2,913 పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేసినట్లు తెలిపారు. రోడ్డు భద్రతలో భాగంగా 508 రోడ్ సేఫ్టీ కమిటీలు, జిల్లాలో నాలుగు బ్లాక్ స్పాట్లను గుర్తించి బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. 1,905 మంది రైతుల పొలాల్లో మట్టి నమూనాలు సేకరించామని, 330 భూమి ఆరోగ్య కార్డులను పంపిణీ చేశామని వివరించారు. ప్రైవేట్ సంస్థలలో అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేసి షీ బాక్స్ పోర్టల్‌లో నమోదు చేశామని తెలిపారు. ఈ 99రోజుల కార్యక్రమం జూన్12వ తేదీ వరకు జరగనుందన్నారు. తొలుత వివిధ స్టాళ్లను పరిశీలించారు. వివిధ శాఖల కార్యక్రమాల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా శాఖల అధికారులు వివరించారు.
అధికార, ప్రతిపక్ష నేతల విమర్శలు
అధికార, ప్రతిపక్ష నేతలు విమర్శలు చేసుకున్నారు. చిన్నకోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మీసం మహేందర్ మాట్లాడుతూ వడ్ల కొనుగోలు జరుగుతున్నా మాజీ మంత్రి హరీశ్‌రావు రైతులతో ధర్నాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. పాలమాకుల పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, హరీశ్ రావులు జిల్లాలో ప్రాజెక్ట్‌లు నిర్మించడం వల్లే గోదావరి జలాలు వచ్చాయన్నారు. దీంతో పంటల దిగుబడి పెరగడంతో పాటు ఆయిల్‌పామ్ పంట సాగుకు అనుకూలంగా మారిందన్నారు. కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడవద్దని, సిద్దిపేట అభివృద్ధి, ప్రణాళిక గురించి మాత్రమే మాట్లాడాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం, పలు మార్కెట్ కమిటీల చైర్మన్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సంక్షేమం మరింత చేరువ
కలెక్టర్ హైమావతి
‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’
జిల్లా స్థాయి సమావేశం


