హుస్నాబాద్: మండుతున్న ఎండలకు మున్సిపాలిటీలో తాగునీటి అవసరాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పట్టణంలో 20 వార్డులు ఉన్నాయి. 7,228 మిషన్ భగీరథ కనెక్షన్లు ఉన్నాయి. పట్టణానికి 7 కి.మీ. దూరంలో ఉన్న మహ్మదాపూర్ సంపు నుంచి రోజూ 2.4 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేస్తున్నారు. రెండు రోజులకోసారి మున్సిపల్ అధికారులు నల్లాల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ఉదయం 10 తర్వాత సరఫరా చేస్తుండటంతో చాలా మంది పనులకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అవికూడా 10 నుంచి 15 బిందెల వరకే నీళ్లు వస్తున్నాయి. ఈ నీళ్లు తాగడానికి, ఇంటి అవసరాలకు సరిపోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రజల నీటి అవసరాల మేరకు ప్రత్యామ్నాయంగా వాటర్ ట్యాంక్‌ల ద్వారా నీటిని అందిస్తున్నారు. పట్టణం విస్తరిస్తుండటం.. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా మంచి నీటి సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. చాలా మంది మినరల్ వాటర్ ప్లాంట్ల వద్దకు వెళ్లి నీటిని కొని తెచ్చుకుంటున్నారు. వేసవి కాలంలో రోజూ నీటి సరఫరా చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


