నంగునూరు(సిద్దిపేట): పాలిసెట్‌కు సర్వం సిద్ధం చేశామని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, రాజగోపాలపేట పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ గోవర్ధన్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా, వ్యవసాయ వెటర్నరీ కోర్సులో ప్రవేశాల కోసం బుధవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 1.30 వరకు పరీక్ష జరుగుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,037 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్‌లో కలిపి మొత్తం 11 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. నిమిషం నిబంధన అమలులో ఉందని, ఓఎంఆర్ షీట్‌కు రెండు వైపులా విద్యార్థుల వివరాలు నమోదు చేయాల్సి ఉన్నందున గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలన్నారు.
సిద్దిపేటఅర్బన్: ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఎప్‌సెట్ పరీక్షలు సోమవారంతో ప్రశాంతంగా ముగిశాయి. మొదటగా అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించారు. అనంతరం మూడు రోజుల పాటు ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించారు. సీబీటీ విధానంలో జరిగిన పరీక్షకు సోమవారం ఉదయం సెషన్‌కు 50 మంది విద్యార్థులకు గాను 49 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌కు 48 మంది హాజరయ్యారు. పరీక్షలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీపీ రాజు, అబ్జర్వర్ భాస్కర్, టీసీఎస్ ఆఫీసర్ సింగిత్‌సింగ్, పీఆర్వో రఘు, సిస్టమ్ అడ్మిన్ షాదుల్లా పర్యవేక్షించారు.
గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో యూఐడీఎఫ్(అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్) పనులపై కదలిక వచ్చింది. యూఐడీఎఫ్ ప్రారంభానికి పట్టిన రాజకీయ గ్రహణంపై ‘సాక్షి’లో ఈనెల 11న ‘నేతల పంతం...అంతా సతమతం’ శీర్షికన ప్రచురితమైన కథనం నేపథ్యంలో కదలిక మొదలైంది. సోమవారం మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ హైదరాబాద్‌లోని యూఐడీఎఫ్ ఈఎన్‌సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్)ని కలిశారు. టెండర్లను వెంటనే ఓపెన్ చేసి, వర్క్ ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. స్పందించిన ఈఎన్‌సీ తగు చర్యలకు హామీ ఇచ్చారు. యూఐడీఎఫ్ పనులకు ఇక ఆటంకాలు తొలిగిపోయినట్లయ్యింది. కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటో తరగతిలో ఆరు ఖాళీలకు గాను అర్హులైన ఎస్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి వెంకటేష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను ఈనెల 18 న సాయంత్రం ఐదు గంటల లోపు కార్యాలయంలో అందించాలన్నారు. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్‌లో లాటరీ పద్ధతిలో అర్హులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లిలో పాండురంగ ఆశ్రమ గురువులు విఠల్‌శర్మ ఆధ్వర్యంలో బొడ్రాయి, పోతలింగేశ్వరస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపన సోమవారం ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ కనకవ్వ, నేతలు నవీన్‌కుమార్, నరేందర్, అమరేందర్, పాండురంగం, భూములుగౌడ్, రాములు, శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.


