● జిల్లాలో 27 పరీక్షా కేంద్రాలు
● హాజరు కానున్న 9,142 మంది విద్యార్థులు
సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13 నుంచి 21వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇంటర్ విద్యాధికారులు పూర్తి చేశారు. పరీక్షల నిర్వహణలో కీలక పాత్ర పోశించనున్న సీఎస్, డీఓలకు సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యాధికారి (డీఐఈఓ) రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 27పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాగా ఫస్టియర్‌లో 654, సెకండియర్‌లో 3,488 మంది మొత్తం 9,142 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు చెప్పారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్న 12గంటల వరకు ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షలను పారదర్శకంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వివరించారు. విద్యార్థులు నిర్ణీత సమయం కంటే అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా గదుల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పరీక్షల కమిటీ సభ్యులు జ్యోతి, గంగాధర్, దేవయ్య, స్థానిక కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు
సిద్దిపేటకమాన్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న కేంద్రాల వద్ద 163బీ ఎన్‌ఎస్‌ఎస్ నిబంధనలు అమల్లో ఉంటాయని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 7నుంచి సాయంత్రం 7గంటల వరకు నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. కేంద్రాల సమీపంలో ప్రమాదకరమైన వస్తువులు కలిగి ఉండకూడదన్నారు. సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి వేసి ఉంచాలని సీపీ ఆదేశించారు. పరీక్షలకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.


