బక్రీద్ నేపథ్యంలో పకడ్బందీ చర్యలు: సీపీ
సిద్దిపేటకమాన్: బక్రీద్ పండగ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కమిషనరేట్ పరిధిలో చెక్‌పోస్టులు కట్టుదిట్టం చేసినట్లు సీపీ రష్మీపెరుమాళ్ తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం వెటర్నరీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పండగ సమయంలో చట్ట విరుద్ధ రవాణా, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు చెక్‌పోస్టులను కట్టుదిట్టం చేశామన్నారు. జిల్లాలోని ప్రధాన రహదారులు, సరిహద్దు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. పశువుల రవాణాలో సంబంధిత పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అదనపు డీసీపీ కుశాల్కర్, ఏసీపీలు రవీందర్‌రెడ్డి, సుమన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


