జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి
సిద్దిపేటకమాన్: మధ్యవర్తిత్వంతోనే ప్రజలకు సత్వర న్యాయం చేకూరుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. సిద్దిపేట కోర్టులో 30మంది న్యాయవాదులకు నిర్వహించిన 40గంటల మీడియేషన్ శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మీడియేషన్ ద్వారా ఆస్తి తగాదాలతో పాటు తదితర కేసుల్లో న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. శిక్షణలో పాల్గొన్న న్యాయవాదులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జయప్రసాద్, కుమారస్వామి, సాధన, తరణి, సౌజన్య, న్యాయవాదులు రవీందర్, రాజలింగం, తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఇందిరానగర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థినులు జాతీయ స్థాయి గోల్ షాట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు గోల్ షాట్‌బాల్ సెక్రటరీ మహేష్ బుధవారం తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 9 నుంచి 11వరకు జరుగనున్న జాతీయ స్థాయి పోటీల్లో క్రీడాకారులు అక్షయ, అర్చన, కృపారాణి పాల్గొంటారన్నారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులను పీడీ సుజాత తదితరులు అభినందనలు తెలిపారు.
‘నాచగిరి’ నుంచి మృత్తిక సేకరణ
వర్గల్(గజ్వేల్): భద్రాచలంలోని గోవింద కల్పవృక్ష నరసింహ శాలగ్రామ ఆశ్రమంలో భూవరాహ యజ్ఞం కోసం గురువారం నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రం నుంచి మృత్తిక(మట్టి) సేకరించారు. ఆలయ ఈఓ రంగాచారి, అర్చక పరివారం సమక్షంలో ఆశ్రమ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణచైతన్యస్వామి ప్రాంగణంలోని చెట్టు వద్ద మృత్తికను సేకరించారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, రైతు క్షేమం కాంక్షిస్తూ ఏరువాక పౌర్ణమి రోజున భూవరాహ యజ్ఞం నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణచైతన్యస్వామి అన్నారు. గడప గడపకు నరసింహం అనే మహోన్నత ఆశయంతో నిర్వహిస్తున్న యజ్ఞం కోసం ప్రముఖ పురాతన నరసింహస్వామి క్షేత్రాలను సందర్శించి మృత్తిక సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.


