డబ్బు, ప్రలోభాలు శాశ్వతం కాదు | - | Sakshi
Sakshi News home page

డబ్బు, ప్రలోభాలు శాశ్వతం కాదు

May 6 2026 9:07 AM | Updated on May 6 2026 9:07 AM

డబ్బు, ప్రలోభాలు శాశ్వతం కాదు

ధర్మాన్ని, శ్రమను నమ్ముకున్నవారే గెలుస్తారు

మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌

గజ్వేల్‌రూరల్‌: రాజకీయాల్లో డబ్బు, ప్రలోభాలు శాశ్వతం కాదని, ప్రళయాన్ని సృష్టించే శక్తి ప్రజలకే ఉందని మేడ్చల్‌–మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. ఈనెల 10న సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు మంగళవారం గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ డబ్బులు ఇస్తేగాని గెలవలేమనే ఈ రోజుల్లో తమిళనాడులో విజయ్‌ డ్రైవర్‌ కొడుకు గెలుపొందారని అన్నారు. రాజకీయాల్లో ధర్మాన్ని, శ్రమను నమ్ముకున్నవారే గెలుస్తారనడానికి తమిళనాడు ఎన్నికలే నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ... నియంతృత్వంగా వ్యవహరించే వారికి బెంగాల్‌ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ పాలనపై విసుగు చెందిన ప్రజలు ఆ పార్టీని ఓడించగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లకే రేవంత్‌రెడ్డిపై వ్యతిరేకత వచ్చిందని, ప్రజాపాలన అంటే 32ఏళ్లుగా ఒకే పార్టీని ఆదరిస్తున్న గుజరాత్‌ రాష్ట్రమే ఉదాహరణ అని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దేశభద్రత కోసం ప్రజలు ఓటు వేశారని చెప్పారు. ఈనెల 10న పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే ప్రధాని బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌, పార్టీ నాయకులు, ఆయా మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement