కాంగ్రెస్‌లో చేరికలు
అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం అంతక్కపేట గ్రామంలోని పలువురు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఆ నాయకులకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రిటైర్డ్ హోంగార్డు గుజ్జుల వెంకటేశంతోపాటు కాశ బోయిన రమేశ్, మేదిని సాంబరాజు, ఇట్టబోయిన మోహన్, కాశబోయిన పోశ య్య పార్టీలో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు జంగపల్లి అయిలయ్య, నాయకులు కాశబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.
మందుబాబులకు జరిమానా
సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వాహన తనిఖీల్లో పది మంది పట్టు బడ్డారు. వారిని సోమవారం కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి వారికి రూ.1,06,000 జరిమానా, ఒకరికి పది రోజుల జైలు శిక్ష విధించారు.
అడ్మిషన్లకు చివరి అవకాశం
మద్దూరు(హుస్నాబాద్): ఓపెన్ స్కూల్‌లో పదోతరగతి, ఇంటర్‌లో ప్రవేశాలకు 7వ తేదీతో గడువు ముగుస్తుందని, ప్రభుత్వం చివరి అవకాశం కల్పించిందని రేబర్తి ఉన్నత పాఠశాల కో–ఆర్టినేటర్ వరదరాజు, అసిస్టెంట్ కో– ఆర్టినేటర్ చంద్రభాను సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
విదేశాలలో ఉన్నత విద్యకు శిక్షణ తరగతులు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విదేశాలలో ఉన్నత విద్యావకాశాలు, స్కాలర్‌షిప్‌లపై బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత అవగాహన తరగతులు నిర్వహించనున్నట్లు డాక్టర్ కృష్ణదయాసాగర్ సోమవారం తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 21లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, పూర్తి వివరాలకు సిద్దిపేట బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్
సంగారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి ఐటీఐ సీఎస్‌ఐ చర్చి జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ కొంతకాలంగా పని చేయడం లేదు. అలాగే ఈ రోడ్డుపై కనీసం ట్రాఫిక్ సిబ్బంది కూడా పనిచేయడం లేదు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతోంది.


