
స్వచ్ఛతలో వెనుకడుగు
సాక్షి, సిద్దిపేట: పరిశుభ్రతతోపాటు పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాల్లో వెనుకబడుతున్నాం. గతంలో స్వచ్ఛసర్వేక్షణ్‌లో దక్షిణ భారత దేశంలోనే సిద్దిపేట మున్సిపాలిటీ మొదటి ర్యాంక్ సాధించింది. అలాగే గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపాలిటీలు సైతం ర్యాంక్‌లు సాధించాయి. ప్రతీ సంవత్సరం పెరుగుతున్న జనాభా, అవసరాలకు అనుగుణంగా స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాల్సిన అధికారులు మొక్కుబడి చర్యలు చేపడుతుండటంతో ర్యాంక్‌లు పడిపోతున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్–2024–25లో దేశవ్యాప్తంగా 4,589 మున్సిపాలిటీలు పాల్గొనగా రాష్ట్రానికి చెందిన 143 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ నెల 17న స్వచ్ఛ సర్వేక్షణ్ మార్కులు, జాతీయ, రాష్ట్ర స్థాయి ర్యాంకులను ప్రకటించారు.
12,500 మార్కులకు..
స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలలో 12,500 మార్కులు కేటాయించారు. ఆయా కేటగిరిల వారీగా మార్కులను మున్సిపాలిటీలు సాధించాయి. ఉమ్మడి జిల్లాలో పదిలోపు ర్యాంకును ఒక్క హుస్నాబాద్ మున్సిపాలిటీ మాత్రమే సాధించింది. అట్టడుగు స్థానంలో 142వ ర్యాంక్‌తో చేర్యాల మున్సిపాలిటీ ఉంది. ఉమ్మడి జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు గతంలో పారిశుద్ధ్యంపై పెట్టిన శ్రద్ధ ఇప్పుడు పెట్టడం లేదని.. ఎక్కడ పడితే అక్కడ చెత్త దర్శనమిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రత్యేక దృష్టి సారించాలి
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులను చూస్తే మన పట్టణాల పరిస్థితి అర్థమవుతుంది. ఇప్పటికై నా పట్టణాల్లో పరిసరాలు పరిశుభ్రతను పాటించి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంక్‌లు వచ్చే విధంగా అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులను మంత్రులు తీసుకువచ్చి పట్టణాలను మరింత అభివృద్ధి పరిచి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన స్థానాలు సాధించే విధంగా కృషి చేయాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
మరుగుదొడ్ల నిర్వహణ శూన్యం
పట్టణాల్లో వాహనదారులు, బాటసారుల కోసం అత్యవసర పరిస్థితిలో వినియోగించుకునేందుకు పలు జంక్షన్‌లలో మరుగుదొడ్లను నిర్మించారు. వాటిని రోజు శుభ్రం చేయకపోవడంతో ఆధ్వానంగా తయారయ్యాయి. పలు చోట్ల వినియోగించలేని పరిస్థితిలో ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. హుస్నాబాద్, దుబ్బాక, మెదక్, తుఫ్రాన్, బొల్లారం పట్టణాల్లో కొంత వరకు వినియోగిస్తున్నారు. డంప్‌యార్డుల్లో బయోమైనింగ్ చేయడం లేదు. మున్సిపాలిటీలలో సాధించిన వివిధ కేటగిరీల ఆధారంగా మార్కుల శాతం కేటాయించారు. ఇంటింటికి చెత్త సేకరణ, వ్యర్థాలను వేరు చేయుట, వ్యర్థాల రీసైక్లింగ్, డంప్‌యార్డులో బయోమైనింగ్, నివాస స్థలాల్లో శుభ్రత, మార్కెట్ ప్రాంతంలో స్వచ్ఛత , నీటి వనరుల వద్ద శుభ్రత, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణపై మార్కులను కేటాయించారు.
కేటాయించిన ర్యాంకులు ఇలా..
మున్సిపాలిటీ జాతీయ రాష్ట్రస్థాయి స్కోర్
హుస్నాబాద్ 139 09 8,889
తెల్లాపూర్ 227 18 8,437
అమీన్‌పూర్ 330 31 8,015
గజ్వేల్ 337 35 7,865
సదాశివపేట 516 52 7,418
జహీరాబాద్ 327 54 7,356
మెదక్ 616 61 7,085
బొల్లారం 628 63 7,053
సిద్దిపేట 448 73 6,692
నారాయణఖేడ్ 990 89 6,224
సంగారెడ్డి 542 94 6,108
దుబ్బాక 946 97 6,087
నర్సాపూర్ 1,161 105 5,816
అందోల్ 1,149 117 5,379
తూప్రాన్ 1,162 119 5,333
రామాయంపేట 1,591 132 4,612
చేర్యాల 1,815 142 3,511
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంక్‌ల ప్రకటన
గతంలో మెరిసిన సిద్దిపేట..ఇప్పుడు వెనక్కి ఉమ్మడి మెదక్ జిల్లాలో హుస్నాబాద్ టాప్
పట్టణాల్లో అధ్వానంగా ప్రజా మరుగుదొడ్లు