
ఇష్టంగా చదవండి.. ఉన్నతంగా ఎదగండి
పద్యాలు చదవడమే కాదు అర్థం చేసుకోవాలి: కలెక్టర్
మర్కూక్(గజ్వేల్): విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని, పద్యాలు చదవడమే కాదు వాటిలోని భావాలు అర్థం చేసుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మండలకేంద్రంలో శుక్రవారం కలెక్టర్ పర్యటించారు. జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను పరిశీలించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందిస్తున్నారా లేదా అని అడిగితెలుసుకున్నారు. టెన్త్ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పోతన పద్యం అడిగారు. శ్రీజ అనే విద్యార్థిని పద్యం పాడి భావం వివరించడంతో కలెక్టర్ అభినందించారు. తెలుగును ప్రతి ఒక్కరూ తప్పని సరిగా చదవడం, రాయడం నేర్చుకోవాలని కలెక్టర్ సూచించారు.
అభివృద్ధి పనుల పరిశీలన
మండలకేంద్రంలో కలెక్టర్ సుమారు గంట పాటు పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. మండలకేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, ఓపెన్ డ్రైనేజ్, తహసీల్దార్ కార్యాలయం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక వైద్య కేంద్రం అలాగే ఐఓసీ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ త్వరితగతిన నిర్మించుకోవాలన్నారు. మురుగు కాల్వలు నిండిపోవడంతో ఎందుకు శుభ్రం చేయించలేదని గ్రామ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో కాల్వలు శుభ్రం చేయాలన్నారు. తహసీల్దార్ ప్రవాణ్‌కుమార్, ఎంపీడీఓ అశోక్‌కుమార్, ఎంఈఓ వెంకట్‌రాములు పాల్గొన్నారు.