
నానో ఎరువులతో లాభాలెన్నో
● రైతులను ప్రోత్సహించాలి ● జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి
గజ్వేల్: నానో యూరియా, డీఏపీ వాడేలా రైతులను ప్రోత్సహించాలని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని రైతువేదికలో ఫర్టిలైజర్స్ డీలర్లకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన స్వరూపరాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ ఇఫ్కో నానో యూరియా, డీఏపీ ఉత్పత్తి చేస్తున్నదని చెప్పారు. ఇవి వాడటం వల్ల వ్యవసాయోత్పత్తుల ఉత్పాదకత, నాణ్యత పెరుగుతుందన్నారు. ఇవీ విత్తన అంకురోత్పత్తిని మెరుగుపరుస్తాయన్నారు. పంటకు పర్యావరణ ఒత్తిడి, తెగుళ్లను తట్టుకునే శక్తిని అందిస్తాయన్నారు. అంతేకాకుండా పర్యావరణహితంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. నేలల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమేకాకుండా, గాలి, నీటి కాలుష్యాన్ని తగ్గిస్తాయని వివరించారు. నానో ఎరువులను బయోస్టీమ్యులెంట్స్, పురుగుమందులు, ఇతర వ్యవసాయరసాయనాలతో మిశ్రమంగా వాడుకోచ్చని తెలిపారు. నానో యూరియా మరియు డీఏపీలను పంటలపై పిచికారీ మాత్రమే చేయాలని, డ్రిప్‌లోగానీ, ఇసుకలో కాలనీ కలిపి వేయవద్దన్నారు. అవగాహన సదస్సులో గజ్వేల్ ఏడీఏ బాబునాయక్, వ్యవసాయాధికారి నాగరాజు, ఇఫ్కో సంస్థ రాష్ట్ర మేనేజర్ కృపాశంకర్, జిల్లా మేనేజర్ చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.