ట్రిపుల్‌ఆర్ బాధితులను ఒప్పించేందుకు ప్రయత్నాలు
ట్రిపుల్‌ఆర్ ఉత్తర భాగం పనులనుప్రారంభించేందుకు సిద్ధమవుతున్న వేళ..గజ్వేల్ కాలా(కాంపీటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్వాజైషన్) పరిధిలో పరిహారంపంపిణీని పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. గతంలో వేసిన లెక్కలతో పోలిస్తే..రెండు నుంచి మూడింతలు పరిహారం ఇవ్వడానికి హామీలు ఇస్తున్నారు. ఇక్కడ 960ఎకరాలకు సంబంధించి సుమారుగా రూ.130కోట్ల పరిహారం అందజేయాల్సి ఉన్నదని లెక్కలు వేస్తుండగా ఇందులో ఇప్పటికే రూ.40కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలుస్తోంది. మరో రూ.35కోట్లు త్వరలోనే అందజేయడానికి కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ఫోకస్
గజ్వేల్: ట్రిపుల్‌ఆర్ (రీజినల్ రింగు రోడ్డు) భూసేకరణ కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని (సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి)ల పరిధిలో రెవెన్యూ డివిజన్ల వారీగా కాలా(కాంపీటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్వాజైషన్)లు పనిచేస్తున్న సంగతి తెల్సిందే. ఇందులోభాగంగానే చౌటుప్పల్, యాదాద్రి–భువనగిరి, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్, ఆందోల్–జోగిపేట, సంగారెడ్డి కాలాల పరిధిలోని 84గ్రామాల్లో 4,832.5 ఎకరాల భూసేకరణ లక్ష్యం పూర్తయ్యింది. ఇక రైతులకు పరిహారం పంపిణీపై అధికారులు దృష్టి పెట్టారు.
గరిష్టంగా రూ.60లక్షలు..
కనిష్టంగా రూ.25లక్షలు
గజ్వేల్ కాలా పరిధిలో ప్రస్తుతం అధికారులు వేస్తున్న లెక్కల ప్రకారం గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లోగల కొన్ని సర్వే నంబర్ల భూములకు రూ.60లక్షలకుపైగా గరిష్టంగా పరిహారం అందుతుందని, రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామంలో కనిష్టంగా రూ.25లక్షలకుపైగా పరిహారం అందుతుందని చెబుతున్నట్లు తెలిసింది. ఆయా గ్రామాల భూముల విలువలను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నట్లు సమాచారం. ఈ లెక్కల ప్రకారం గజ్వేల్ కాలా పరిధిలో రైతులకు ఇవ్వాల్సిన రూ.130కోట్ల పరిహారంలో ఇప్పటికే రూ.40కోట్ల పరిహారం రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెల్సింది. మరో రూ.35కోట్ల పంపిణీకి సైతం సిద్ధమైనట్లు సమాచారం. మిగతా పరిహారం కూడా సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేయాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నట్లు తెలుస్తోంది.
గజ్వేల్‌లో కాలా పరిధిలో
రూ.130కోట్లకుపైగా పరిహారం
ఇప్పటికే రూ.40కోట్ల మేర పంపిణీ
మరో రూ.35కోట్లు పంపిణీకి సిద్ధం!!
స్పీడ్ పెంచిన అధికారులు
గతంతో పోలిస్తే... మూడింతల పరిహారం!
గతంలో అధికారులు ట్రిపుల్‌ఆర్ బాధితులు కోల్పోతున్న భూములకు ప్రభుత్వ విలువపై మూడింతల పరిహారం అందజేస్తామని చెబుతూ వచ్చారు. కానీ ఈ ప్రతిపాదనపై రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది. వారి లెక్కల ప్రకారం గజ్వేల్ ప్రాంత పరిధిలో ఎక్కడా కూడా రైతులకు ఎకరాకు రూ.12లక్షల నుంచి రూ.20లక్షల పరిహారం అందే పరిస్థితి కనిపించలేదు. బహిరంగ మార్కెట్‌లో కోట్లల్లో విలువ పలుకుతున్న తమ భూములను అతి తక్కువ ధరలకు గుంజుకుంటారా...? అంటూ పలుమార్లు ఆందోళనలకు దిగిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో గతంలో వేసిన లెక్కలతో పోలిస్తే రెండు నుంచి మూడింతల పరిహారం ఇచ్చి రైతులను ఒప్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది.


