● ఎదురుచూస్తున్న మొక్కజొన్న రైతులు ● 960మంది రైతుల నుంచి 22వేలక్వింటాళ్ల ధాన్యం కొనుగోలు
వట్‌పల్లి(అందోల్): మొక్కజొన్నల డబ్బులు చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోంది. ఎలాంటి ఆలస్యం లేకుండా నగదు చెల్లింపులు ఉంటాయన్న అధికారులు, ప్రజా ప్రతినిధుల మాటలు కార్యరూపం దాల్చడం లేదు. మొక్కజొన్న మంచి దిగుబడి రావడంతో తమ కష్టాలు తీరుతాయని భావించిన రైతులు ధాన్యం విక్రయించి దాదాపుగా ఇరువై రోజులు గడుస్తున్నా నగదు చెల్లింపులు జరుగకపోవడంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సుమారుగా 8,700 ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట సాగైంది. దీంతో జిల్లాలో నాలుగుచోట్ల జోగిపేట, తాలెల్మ, జహీరాబాద్, కోహీర్‌లలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించకుండా ఎక్కువ మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. 960 మంది రైతుల నుంచి 22 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోల్లు చేసినట్లుగా మార్క్‌ఫెడ్ అధికారులు చెబుతున్నారు. దీంతో సుమారుగా 5.28 కోట్ల నిధులు బకాయిలు పడ్డాయి.
రైతులు ఎదురు తెన్నులు..
ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో తిరిగి రైతులు వ్యవసాయ పనులు ప్రారంభిచాల్సి ఉన్నా మొక్కజొన్న ధాన్యం డబ్బులు జమ కాకపోవడంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఓవైపు రోహిణి కార్తెలో వరి పంటకు నారు మడులు సిద్ధం చేయాల్సి ఉండగా ఎరువుల ధరలు పెరుగుతుండటంపై రైతులు ముందుగానే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక ఆందోళన చెందుతున్నారు.
15రోజులవుతోంది
మొక్కజొన్న పంటను విక్రయించి 15 రోజులవుతోంది. ఇంకా డబ్బులు జమ కాలేదు. వరి ధాన్యం కొనుగోళ్లు కూడా ఆలస్యం కావడంతో వరి పంటను విక్రయించలేదు. దీంతో పంట కోతల సంబందించి ట్రాక్టర్ల, మిషన్ల డబ్బులు కూడా చెల్లించలేదు. ఎరువుల బస్తాల ధర పెరుగుతుందని చెప్పడంతో ముందుగానే ఎరువులు కొనుగోలు చేద్దామంటే డబ్బులు లేక కొనుగోలు చేయలేదు.
– కాల్వమీది రమేశ్, రైతు, కన్‌సాన్‌పల్లి
రెండు మూడు రోజుల్లో చెల్లిస్తాం
ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బులు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తాం.
– చంద్రశేఖర్‌గౌడ్, మార్క్‌ఫెడ్ డీఎం


