పటాన్‌చెరు టౌన్: అగ్నిప్రమాదంలో టిప్పర్లు, కార్లు, ఆటోలు కాలిపోయాయి. ఈ సంఘటన పటాన్‌చెరు పరిధిలో చోటుచేసుకుంది. పటాన్‌చెరు శివారులో శ్రీరామ్ మాల్ వాహనాలు నిలిపే స్థలం ఉంది. ఈ సంస్థ ఫైనాన్స్ వివాదాల్లో ఉన్న వాహనాలను ఇక్కడికి తెచ్చి ఉంచుతారు. అయితే మంగళవారం మధ్యాహ్నం వాహనాలు నిలిపేచోట అగ్ని ప్రమాదం సంభవించి వాహనాలు కాలిపోయాయి. ఇందులో ఐదు టిప్పర్లు, ఒక లారీ, ఐదు కార్లు, 12 ఆటోలు 11కు పైగా బైకులు ఉన్నాయి. కాగా బైకులు, ఆటోలు పోలీస్ కేసులో ఉన్న వాటిని అక్కడ ఉంచడంతో అవి కూడా తగలబడ్డాయని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు. ఆవరణలో ఎవరో సిగరెట్ వెలిగించి పడేయడంతో ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. రెండు అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను అదుపు చేశాయి.
షార్ట్ సర్క్యూట్‌తో బ్యాటరీ షాప్..
పెద్దశంకరంపేట(మెదక్): షార్ట్ సర్క్యూట్‌తో బ్యాటరీ షాప్ దగ్ధమైంది. ఈ సంఘటన మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. వివరాలు... పేటకు చెందిన అబ్దుల్ సోమవారం రాత్రి షాప్ మూసివేసి ఇంటికి వెళ్లాడు. షార్ట్ సర్క్యూట్‌తో షాపులో ఉన్న బ్యాటరీలు, ఇన్వర్టర్లు, ఎలక్ట్రానిక్స్ సామగ్రి కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలు ఆర్పారు. ఈ ప్రమాదంలో రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితుడు తెలిపాడు. సంఘటనా స్థలాన్ని తహసీల్దార్ ప్రభుదాస్ పరిశీలించారు.
వెంకటాపూర్‌లో కిరాణా దుకాణం..
నారాయణఖేడ్: మండలంలోని వెంకటాపూర్‌లో మంగళవారం తెల్లవారు జామున కిరాణా దుకాణం దగ్ధమై రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. వివరాలు.. మదినా పటేల్ ఇంట్లోనే కిరాణా దుకాణం నడుపుతున్నాడు. సోమవారం రాత్రి రోజూ లాగే దుకాణాన్ని మూసివేసి నిద్రించాడు. తెల్లవారు జామున అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడటంతో మేల్కొని చుట్టుపక్కల వారితో కలిసి ఆర్పే ప్రయత్నం చేశాడు. అలాగే ఖేడ్ అగ్నిమాప కేంద్రానికి సమాచారం అందించగా వారు వచ్చి మంటలార్పారు. అప్పటికే దుకాణంలోని సామగ్రి కాలిపోయింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి నిప్పుపెట్టినట్లు బాధితుడు ఆరోపించాడు.


