16 నకిలీ ఖాతాలు.. 1.80 కోట్లు స్వాహా | - | Sakshi
Sakshi News home page

16 నకిలీ ఖాతాలు.. 1.80 కోట్లు స్వాహా

May 13 2026 5:02 AM | Updated on May 13 2026 5:02 AM

● పని చేస్తున్న బ్యాంకుకే కన్నం ● అతడి భార్యతోపాటు స్నేహితుడి అరెస్ట్‌

మేనేజర్‌ నిర్వాకం.. పరారీ
● పని చేస్తున్న బ్యాంకుకే కన్నం ● అతడి భార్యతోపాటు స్నేహితుడి అరెస్ట్‌

మెదక్‌ కలెక్టరేట్‌: నకిలీ ఖాతాలతో బ్యాంకులో రూ.1.80కోట్లు స్వాహా చేశాడు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. మంగళవారం మెదక్‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌, పట్టణ సీఐ మహేశ్‌ పోలీసు స్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన యాదం అనిల్‌ జిల్లా కేంద్రంలోని ఆదర్శ కో–ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అనిల్‌ బెట్టింగ్‌ మోజులో నిండా మునిగాడు. దీంతో బెట్టింగ్‌ల కోసం భార్య స్రవంతి, స్నేహితుడు సుబ్రహ్మణ్యంతోపాటు మొత్తం 16 నకిలీ ఖాతాలు తెరిచారు. వారి ఖాతాల ద్వారా వారి ఆధార్‌, పాన్‌కార్డులపై బ్యాంకులో నకిలీ బంగారం పెట్టి రూ.1.80 కోట్లు మేర లోన్లు తీసుకున్నాడు. గతంలో రెండు ఏటీఎంల నుంచి డిపాజిట్‌ చేసే సమయంలోనూ కొంత నగదును పక్కన పెట్టి, రూ.31.35 లక్షలను వాడుకున్నాడు. ఇతనికి బ్యాంకులో బంగారాన్ని పరిశీలించే వ్యక్తి శ్రీనివాసచారి సహకరించిన ట్లు గుర్తించారు. దీంతో వారిపై కేసు నమోదు చేశారు. అనిల్‌ గతంలో ఏపీ వైలెపాడు పీఎస్‌ పరిధిలో గ్రామీణ వికాస్‌ బ్యాంకులో పోలవరం నిర్వాసితులను మోసం చేసి రూ. 11లక్షల 82,487 వాడుకొని జైలు పాలయ్యాడు. ప్రస్తుతం మేనేజర్‌ అనిల్‌ పరారీలో ఉన్నాడు. అతని భార్య స్రవంతి, శ్రీనివాసచారి, సుబ్రహ్మణ్యంను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పర్చారు.

బయటికొచ్చింది ఇలా..

అనిల్‌ భార్య స్రవంతి ఖాతా సైబర్‌ క్రైమ్‌ అధికారుల పరిశీలనలోకి రావడంతో బ్యాంకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో వారు బ్యాంకులోని ఖాతాలు, గోల్డ్‌లోన్లను పరిశీలించగా చాలా వరకు నకిలీ బంగారం ఉన్నట్లు తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement