● పల్లెల్లో జోరుగా పత్తలాట
● వ్యసనంగా మారిన జూదం
● కట్టడి చేయాలని స్థానికుల డిమాండ్
జహీరాబాద్ టౌన్: పల్లెల్లో పత్తలాట జోరుగా సాగుతోంది. సరదాగా ఆడుకునే పేకాట కొందరికి వ్యసనంలా మారుతోంది. సులభంగా డబ్బులు సంపాదించాలన్న అత్యాశతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. గ్రామీణ శివారు ప్రాంతాలనూ లక్ష్యంగా చేసుకొని యథేచ్ఛగా పేకాట ఆడుతున్నారు. జహీరాబాద్ పట్టణంతో పాటు గ్రామాల్లో కొంత మంది పేకాట జూదం ఎక్కువగా ఆడుతున్నారు. ఎవరికి అనుమానం రాకుండా పంట పొలాలు, చెట్ల పొదలు, తోటలు వేదికగా మార్చుకుంటున్నారు. ఆడేవారికి తప్ప ఇతరులకు ఏ మాత్రం సమాచారం లేకుండా జాగ్రత్త పడుతున్నారు. బృందాలుగా ఏర్పడి నిర్ణయించుకున్న స్థలానికి చేరుకుంటారు. మద్యం, మాంసం అక్కడికే తెప్పించుకుని పొలాలను అడ్డాగా మార్చుకుంటున్నారు. పోలీసుల దాడుల్లో జూదరులు పట్టుబడుతున్నా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు.
శివారు ప్రాంతాల్లో..
వేసవిలో పొలం పనులు తక్కువగా ఉండటంతో ఖాళీ సమయం దొరుకుతోంది. యాసంగి పంటలు అమ్ముడుపోయే సరికి చేతిలో కూడా డబ్బు ఉంటుంది. దీంతో ఒక ఆటేద్దామని జూదం ఆడుతున్నారు. సామాన్య ప్రజలే కాకుండా వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు కూడా మొగ్గు చూపుతున్నారు. అప్పుపడప్పుడు పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. జూదరులతో పాటు నగదు, పేకాట ముక్కలు, మోటారు బైక్‌లు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుంటున్నారు. అయినప్పటికీ జూదానికి అలవాటు పడినవారు ఏ మాత్రం భయపడటం లేదు. పోలీసులకు పట్టుబడినా పెద్దగా శిక్ష లేకపోవడంతో జరిమాన కట్టి బయటకు వస్తున్నారు. జహీరాబాద్, న్యాల్‌కల్ తదితర గ్రామాల్లో ఇటీవల పోలీసులు దాడి చేసి 15 మందిపై కేసులు నమోదు చేసి నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు గట్టి నిఘా పెట్టి పేకాటకు అడ్డుకట్టు వేయాలని ప్రజలు కోరుతున్నారు.


