ట్రాన్స్‌పోర్టు.. ట్రబుల్స్‌ | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌పోర్టు.. ట్రబుల్స్‌

May 12 2026 6:18 AM | Updated on May 12 2026 6:18 AM

తొమ్మిదేళ్లుగా ఒకే కాంట్రాక్టరు.. జిల్లా మూడు క్లస్టర్లుగా.. లీజు పేరుతో నెట్టుకొస్తున్నారు.. టన్నుకు రూ.450పైనే చెల్లింపులు..

కొనుగోలు కేంద్రాల్లో లారీల సమస్య ఉందని మాదృష్టికి వచ్చింది. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారమైంది. కేంద్రాలకు అవసరమైన లారీలను పంపుతున్నాము. క్షేత్రస్థాయి అధికారులు ఫాలోఅప్‌ చేస్తున్నారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటవెంటనే కొనుగోలు కేంద్రాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటాం.

–రాజేశ్వర్‌, పౌరసరఫరాల సంస్థ డీఎం.

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో అధికారుల తప్పిదాలు అన్నదాతలను అవస్థల పాలు చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైసుమిల్లులకు తరలించే రవాణా కాంట్రాక్టును అధికారులు కొన్నేళ్లుగా ఒక్కరిద్దరికే కట్టబెడుతున్నారు. ఈ కాంట్రాక్టర్లు కేంద్రాలకు అవసరం మేరకు లారీలు పంపకపోవడంతో కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు నిలిచిపోతున్నాయి. దీంతో ఎండల్లో సైతం రైతులు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది.

కేంద్రాల నుంచి ధాన్యాన్ని రైసుమిల్లులకు తరలించే కాంట్రాక్టును పౌరసరఫరాల సంస్థ అధికారులు తొమ్మిదేళ్లుగా ఒకరిద్దరు గుత్తేదార్లకు కట్టబెడుతున్నారు. 2017 నుంచి వీరే ఈ శాఖలో రాజ్యమేలుతుండటం వెనుక పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వీరిలో ఒకరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండగా, మరొకరు రాజకీయ పలుకుబడి ఉన్న గుత్తేదారు కావడంతో ఏటా వీరి బినామీ పేర్లతో ఉన్న సంస్థలకే ఈ కాంట్రాక్టు దక్కుతోంది. అయినప్పటికీ కనీసం రైతుల అవసరాల మేరకు లారీలను సరఫరా చేయడంలోనూ ఈ గుత్తేదార్లు విఫలమవుతుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పది రోజులైనా లారీలు రాకపోవడంతో ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోల్‌కు చెందిన లక్ష్మణ్‌ అనే రైతు వాపోయారు.

జిల్లా వ్యాప్తంగా 220కి పైగా కొనుగోలు కేంద్రాలను అధికారులు మూడు క్లస్టర్లుగా విభజించారు. సంగారెడ్డి, ఆందోల్‌, ఖేడ్‌ క్లస్టర్లలో ఉన్న కేంద్రాల నుంచి ధాన్యాన్ని తరలించే కాంట్రాక్టు కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో పౌరసఫరాల సంస్థ టెండర్లు పిలిచింది. వరుసగా ఎనిమిదేళ్లుగా ఈ శాఖలో పాతుకుపోయిన ఇద్దరు కాంట్రాక్టర్లకే ఈ సీజను ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టులను కూడా దక్కించుకున్నారు. మూడింటిలో రెండు క్లస్టర్లు ఒక కాంట్రాక్టరుకు, మరో క్లసర్‌ మరో కాంట్రాక్టరుకు అధికారులు కట్టబెట్టారు.

పౌరసరఫరాల సంస్థ నిబంధనల ప్రకారం ఈ కాంట్రాక్టు దక్కాలంటే సదరు కాంట్రాక్టరుకు 40 లారీలు ఉండాలి. ఇందులో 20 సొంతవి, మరో 20 లీజు లారీలు ఉండేందుకు అనుమతి ఉంటుంది. సొంతంగా 20 లారీలతోపాటు మరో 20 లారీలు లీజుకు తీసుకున్నామని రికార్డుల్లో చూపుతున్న కాంట్రాక్టర్లు తమ సొంత 20 లారీలనే సర్దుబాటు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. లీజు లారీలను తిప్పితే లాభాలు తగ్గుతాయనే కారణంగా సొంత లారీలతోనే సీజనంతా సరిపెడుతుండటంతో కేంద్రాల వద్ద అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. ఈ కాంట్రాక్టర్ల విషయంలో నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంలో పౌరసఫరాల సంస్థ అధికారులు విఫలమవుతుండటం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టరుకు ధాన్యం రవాణా చేసేందుకు పౌరసరఫరాల సంస్థ భారీ మొత్తంలోనే చార్జీలు చెలిస్తోంది. 8 కి.మీల లోపు ఉంటే టన్నుకు రూ.417ల చొప్పున చెల్లిస్తారు. 8 కి.మీ.ల నుంచి 20 కి.మీ.ల వరకు అదనంగా రూ.3, 80 కి.మీ.ల వరకు టన్నుకు సుమారు రూ.450 వరకు చెల్లిస్తారు. ఇలా ఏటా లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రవాణా జరుగుతుంది. రూ.కోట్లలో రవాణా చార్జీలు పొందుతున్న కాంట్రాక్టర్లు అరకొరగా లారీలు పంపుతుండటం గమనార్హం. ఉదాహరణకు గతేడాది సుమారు 1.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే సుమారు రూ.6.50 కోట్ల రవాణా చార్జీలు కట్టబెట్టారు. ఈ బిల్లుల చెల్లింపుల్లో పెద్ద మొత్తంలో ముడుపులు చేతులు మారతాయనే ఆరోపణలున్నాయి.

లారీల సమస్య పరిష్కారమైంది

Advertisement
 
Advertisement
Advertisement