బండి భగీరథ్‌పై చర్యలేవి? | - | Sakshi
Sakshi News home page

బండి భగీరథ్‌పై చర్యలేవి?

May 12 2026 6:18 AM | Updated on May 12 2026 6:18 AM

టీటీపీసీ మాజీ చైర్మన్‌ మఠం భిక్షపతి

జోగిపేట(అందోల్‌): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌పై పోక్సోకేసు నమోదై మూడురోజులవుతున్నా పోలీసులు చర్యలెందుకు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలని తెలంగాణ ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మఠం భిక్షపతి ప్రశ్నించారు. ఈ కేసు విషయంలో బీజేపీ కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులో మాట్లాడారు. సామాన్యుడిపై చిన్న కేసు నమోదైతే గంటల్లో అరెస్టు చేసే పోలీసులు బండి సంజయ్‌ కుమారుడి కేసువిషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. బండి సంజయ్‌ తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం రేవంత్‌రెడ్డితో జరిపిన చీకటి ఒప్పందాలను త్వరలోనే ప్రజల ముందు బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. బాధితురాలి తల్లిదండ్రులను బండి సంజయ్‌ స్వయంగా భయభ్రాంతులకు గురిచేస్తూ బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని, అందుకే ఎఫ్‌ఐఆర్‌లో మంత్రి పేరును కూడా చేర్చాలని డిమాండ్‌ చేశారు.

జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

సీపీఎం నేత చుక్కా రాములు

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలను పరిష్కరించడంతోపాటు జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించిన అనంతరం కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ..రైతులు అమ్ముకున్న పంటకు ఎదురు చూడకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం ద్వారా వర్షాలు పడి రైతులు రాత్రింబవళ్లు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ధాన్యం తడవకుండా తాటిపత్రి సౌకర్యాన్ని రైతులకు అందజేయాలన్నారు. కొనుగోళ్లు కేంద్రాలకు వెంటనే సరిప డా సంచులు వెంటనే సరఫరా చేయాలని, హమాలీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యద ర్శి జయరాజు, సీపీఎం నాయకులు మల్లేశం, మాణిక్‌, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన వేసవి శిబిరాలు

జహీరాబాద్‌ టౌన్‌: జహీరాబాద్‌ శ్రామీక విజ్ఞాన కేంద్రం, మన లైబ్రరీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి పిల్లల శిబిరాలు సోమవారంతో ముగిశాయి. ఏప్రిల్‌ 24న ప్రారంభమై మే 11 వరకు కొనసాగాయి. జహీరాబాద్‌ నియోజవకర్గంలోని జహీరాబాద్‌టౌన్‌, రాయికోడ్‌, ఝరాసంగం, మొగుడంపల్లి,కోహీర్‌ మండలాల్లోని 22 గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో 600 మంది చిన్నారులు పలు నైపుణ్యాలు నేర్చుకున్నారు. వేసవి సెలవుల్లో పిల్లలు మొబైల్‌ ఫోన్లలో చాటింగ్‌, వీడియోగేమ్స్‌ వంటి ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌కు బానిసలవకుండా ఉండేందుకు ఉచిత శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శిక్షణ తరగతుల్లో ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్‌, గణిత నైపుణ్యం, చిత్రకళ, స్టోరీ టెల్లింగ్‌, స్టోరీ రైటింగ్‌, మట్టితో బొమ్మల తయారీ, పజిల్స్‌ పరిష్కారం, పేపర్‌ ఆర్ట్‌,ఇంగ్లిష్‌ బేసిక్స్‌, కబడ్డీ, ఖోఖో వంటి ఆటలు, దేశభక్తి, జానపద గీతాలు వంటి పాటలు నేర్పించారు. ముగింపు సందర్భంగా నిర్వాహకురాలు డాక్టర్‌ విజయలక్ష్మి చిన్నారులను అభినందించారు.

రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలిగా శశికళ

రామచంద్రాపురం(పటాన్‌చెరు): తెలంగాణ మహిళా కమిషన్‌ సభ్యురాలుగా శశికళ యాదవ రెడ్డిని నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు

కంది(సంగారెడ్డి): గ్రామాలన్నింటిలో ఉపాధి హామీ పనులు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ స్పెషల్‌ కమిషనర్‌ శ్రీలక్ష్మి ఆదేశించారు. కంది మండల పరిధిలోని కలివేముల, కాశీపూర్‌ గ్రామాల్లో జరుగుతున్న ఉపాధిహామీ పనులను సోమవారం ఆయన తనిఖీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement