రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం

May 12 2026 6:18 AM | Updated on May 12 2026 6:18 AM

మృతురాలు సంగారెడ్డి జిల్లా వాసి

వర్గల్‌(గజ్వేల్‌): రోడ్డు దాటుతున్న డిగ్రీ విద్యార్థినిని కారు రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాదకర ఘటన సోమవారం మండలంలోని గౌరారం రాజీవ్‌రహదారిపై చోటు చేసుకుంది. గౌరారం ఎస్‌ఐ ఆరోగ్యం, కుటుంబీకుల వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండలం ఇందూరు గ్రామానికి చెందిన జంబిగి విఠల్‌, పుణ్యమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె భార్గవి(21) పెద్దపల్లి మహాత్మాజ్యోతిబాపూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బీకామ్‌ కంప్యూటర్స్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతుంది. పరీక్షలు పూర్తికావడంతో సొంత గ్రామమైన ఇందూరులో తల్లిదండ్రుల చెంతనే ఉంటుంది. ఆదివారం వర్గల్‌ గురుకులంలో నిర్వహించిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌కు భార్గవి వచ్చింది. సోమవారం ఇంటికి వెళ్లడానికి భార్గవి బస్సు కోసం రాజీవ్‌ రహదారి దాటుతుండగా హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను పోలీసులు ఆర్వీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కూతురును తలచుకుంటూ తండ్రి విఠల్‌ బోరుమన్నాడు.

రెండు బైకులు ఢీకొని వ్యక్తి..

దుబ్బాకటౌన్‌: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. దౌల్తాబాద్‌ ఎస్సై అరుణ్‌ కుమార్‌, కుటుంబ సభ్యులు వివరాల ప్రకారం... మెదక్‌ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌ గ్రామానికి చెందిన ఈద లాలయ్య బైక్‌పై దౌల్తాబాద్‌కు పనికి వచ్చి తిరిగి గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో కోనాయిపల్లి గ్రామ శివారులో రామయంపేట నుంచి బైక్‌పై దౌల్తాబాద్‌కు వస్తున్న వ్యక్తి ఎదురుగా అతివేగంగా వచ్చి అతడ్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో లాలయ్యకు తలకు, కుడికాలికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన లాలయ్యను ప్రైవేట్‌ వాహనంలో గజ్వేల్‌ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement