జహీరాబాద్ టౌన్: సంగారెడ్డిలో ఈ నెల 12 నుంచి మూడురోజులపాటు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు జరగనున్నాయని వీటిని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రాంచందర్ విజ్ఞప్తి చేశారు. జహీరాబాద్‌లోని శ్రామీక్ భవనంలో ఆదివారం మహాసభల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఈ సమావేశాల్లో వ్యవసాయ కార్మికుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నామన్నారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యవసాయ కార్మికులు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాల
కల్పనకు కృషి
నారాయణఖేడ్: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేశ్ షెట్కార్ తెలిపారు. ఖేడ్ మండలం అబ్బెంద చౌరస్తా వద్ద ఎంపీ సురేశ్ షెట్కార్ కోటా నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల సమగ్రాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. నాగల్‌గిద్ద మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాణిక్‌రావు, నాయకులు కొండల్‌రెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు.
డిగ్రీ కాలేజ్‌లో ఎడ్యుకేషన్ వీక్
ప్రిన్సిపాల్ ప్రవీణ వెల్లడి
పటాన్‌చెరు టౌన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11 నుంచి 17 వరకు ‘ఎడ్యుకేషన్ వీక్’ను నిర్వహించనున్నారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. డిగ్రీ ప్రవేశాల పెంపు, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు విద్యార్థులను సిద్ధం చేయడం, కళాశాల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధుల సేకరణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన – ప్రగతి కార్యక్రమా లపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
బస్సులు లేక జనం తిప్పలు
నారాయణఖేడ్: అసలే పెళ్లిళ్ల సీజన్ కావడం, ఆర్టీసీలో చాలావరకు బస్సులను హైదరాబాద్‌లో జరిగిన ప్రధాని మోదీ సభకు తరలించడంతో బస్సులకోసం ప్రయాణికులు ఆదివారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఖేడ్ ఆర్టీసీ డిపో నుంచి ప్రధాన హైదరాబాద్ రూట్‌లో నిత్యం అరగంటకు ఒక బస్సు చొప్పున 33 సర్వీసులు నడుస్తుంటాయి. సాధారణంగా ఖేడ్ నుంచి హైదరాబాద్ రూట్‌లో వెళ్లే ప్రయాణికులు అత్యధికంగా ఉంటారు. డిపో నుంచి 35 సర్వీసులను ప్రధాని మోదీ సభకు తరలించారు. దీంతో 9 బస్సు సర్వీసులు మాత్రమే హైదరాబాద్ రూట్‌లో నడిపారు. దీంతో బస్టాండ్ జనాలతో కిక్కిరిసి పోయింది.


