● ఒక్క స్కాన్‌తో ప్రయాణం సాఫీ ● టోల్ ప్లాజాలు, కూడళ్లు, సైన్ బోర్డుల వద్ద క్యూఆర్ కోడ్ బోర్డుల ఏర్పాటు
జహీరాబాద్: జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి ఇకపై సమాచారం కోసం ఇతరులను అడగాల్సిన అవసరం లేదు. టోల్ ప్లాజాల వద్ద నిల్చోని ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రయాణికుల సౌకర్యం నిమిత్తం జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నేషనల్ హైవేల వెంబడి ఉన్న మైలు రాళ్లు, సైన్ బోర్డులు, ప్రధాన కూడళ్లు, టోల్ ప్లాజాల వద్ద క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేసింది. మొబైల్‌ఫోన్‌తో దీన్ని స్కాన్ చేస్తే చాలు. రహదారికి సంబంధించిన మొత్తం సమాచారం వచ్చేస్తుంది. వెళ్లే మార్గంలో ఎన్ని టోల్‌ప్లాజాలు ఉన్నాయి?, వాటి మేనేజర్ల వివరాలు, చెల్లించాల్సిన రుసుము తదితర సమాచారం వస్తుంది. పెట్రోల్ బంకులు, పంక్చర్ దుకాణాలు, ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడున్నాయో తెలుసుకోవచ్చు. దగ్గరలో నాణ్యమైన హోటళ్లు, రెస్టారెంట్లు, బస చేసేందుకు వసతి గృహాల వివరాలు కనిపిస్తాయి. ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు, వాహనం మొరాయించినప్పుడు సంప్రదించాల్సిన హైవే హెల్ప్ లైన్ నంబర్లు, అంబులెన్స్, సమీపంలోని ఆస్పత్రుల ఫోన్ నంబర్లు, పోలీసు స్టేషన్ల వివరాలు ఆ సమాచారంలో లభిస్తున్నాయి. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో రెండు జాతీయ రహదారులున్నాయి. కాగా, ఈ జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలతోపాటు ప్రధాన కూడళ్ల వద్ద వీటిని ఏర్పాటు చేశారు.


