క్రికెట్ ఆడుతున్న విద్యార్థులు(ఫైల్)
నెల రోజుల పాటు శిబిరాలు కొనసాగింపు
సంగారెడ్డి: క్రికెట్ నేర్చుకునే వారికి మంచి అవకాశం. క్రికెట్ అంటే చిన్నారులతో పాటు పెద్దవారికి ఎంతో ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా ఇంటి వద్ద, మైదానంలో పిల్లలు ఆడుతుంటారు. పిల్లలకు ఆసక్తి ఉన్నా సరైన ఏర్పాట్లు లేక వెనకబడుతున్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించాలనుకున్నా.. అవకాశం రావడం లేదు. ఇలాంటి వారి కోసం ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ మంచి అవకాశం కల్పిస్తుంది. నెల రోజులపాటు ఉచిత క్రికెట్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఇందుకు మైదానాలను ఎంపిక చేసి నేటి నుంచి ప్రారంభిస్తారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఐదు చోట్ల క్యాంపులు
ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి విద్యార్థులకు ఉచితంగా క్రికెట్ శిక్షణ శిబిరం నిర్వహిస్తారు. సంగారెడ్డి, సిద్దిపేటలో 11న, గజ్వేల్‌లో 12న, మెదక్, జహీరాబాద్‌లో 13న క్యాంపులు ప్రారంభమవుతాయి. ఈ ప్రాంతాల్లో క్రికెట్‌లో అండర్– 14, 16, 19, 23 క్రీడాకారులు శిక్షణలో పాల్గొనేందుకు అర్హులు. క్రీడాకారులు తప్పనిసరిగా వైట్ డ్రెస్ వేసుకురావాల్సి ఉంటుంది. కావాల్సిన సామగ్రి నిర్వాహకులు ఇస్తారు. ఆసక్తి ఉన్నవారు నేరుగా వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి.
క్యాంపుల వివరాలు..
జిల్లా కేంద్రం సంగారెడ్డిలో ఎంఎస్ క్రికెట్ అకాడమీ, సిద్దిపేటలో ఆచార్య జయశంకర్ క్రికెట్ మైదానం, మెదక్‌లో ఇందిరాగాంధీ మైదానం, గజ్వేల్‌లో ఐవోసీ క్రికెట్ మైదానంలో ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం ఆరు గంటల నుంచి ఎంత మంది వచ్చినా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.
ఉచితంగా క్రికెట్ శిక్షణ..
శిక్షణలో పాల్గొనాలనుకునే వారి పేర్లు నమోదు చేసుకోవాలి. ఇక్కడ ప్రతిభ చాటితే రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొనే అవకాశముంటుంది. ఎంపికై న వారిని వచ్చే ఏడాది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అండర్– 14, 16, 19, 23 జిల్లాల్లో పాల్గొనే టోర్నీల్లో అవకాశం కల్పిస్తారు. జాతీయ స్థాయిలో సైతం పాల్గొనే అవకాశం ఉంటుంది.
– రాజేందర్ రెడ్డి, క్రికెట్ అసోసియేషన్,
ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శి


