మృతుడు సంగారెడ్డి జిల్లా వాసి
శంషాబాద్ రూరల్: ప్రమాదవశాత్తు బాలుడు వాగులో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన శంషాబాద్ మండలం ననాజీపూర్‌లో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కె.నరేందర్‌రెడ్డి కథనం ప్రకారం... సంగారెడ్డి జిల్లా ఈదులనాగులపల్లికి చెందిన బ్యాగరి హనుమంతు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 8న ననాజీపూర్‌లో బంధువుల గృహ ప్రవేశానికి వచ్చాడు. మరుసటి రోజు చిన్న కుమారుడు శ్రీచరణ్(17) బహిర్భూమికి బైకుపై వెళ్లాడు. చాలా సేపటి వరకు తిరిగి రాకపోవడంతో పలు చోట్ల వెతికారు. గ్రామ శివారులోని హనుమాన్ ఆలయం వద్ద బైక్ పార్కు చేసి ఉంది. అదే రోజు తండ్రి హనుమంతు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆదివారం ననాజీపూర్ గ్రామ శివారులోని వాగు నీళ్లలో మృతదేహం తేలి ఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకొని శ్రీచరణ్‌గా గుర్తించారు. ప్రమాదవశాత్తు వాగునీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.


