సిద్దిపేటకమాన్: మొబైల్ షాపులో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు 12 గంటల్లోనే అరెస్టు చేశారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ వివరాల ప్రకారం... పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఎండీ బాబా కమ్యూనికేషన్ మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ నెల 9న సాయంత్రం షాపును మూసి ఇంటికి వెళ్లాడు. నంగునూరు మండలం ఖాతా గ్రామానికి చెందిన శివరాత్రి దివాకర్ (26) షాప్ షెట్టర్‌ను తెరిచి కౌంటర్‌లో ఉన్న రూ.14వేలను చోరీ చేశాడు. షాప్‌లో చోరీ జరిగినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపటిన పోలీసులు చోరీ జరిగిన ప్రాంతంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని ఆదివారం అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడు రెండు రోజుల క్రితం ఖాతా గ్రామంలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడి రూ.2వేలు దొంగిలించాడు. నిందితుడిపై పలు పోలీసు స్టేషన్‌ల పరిధిలో సుమారు 20 చోరీ కేసులు నమోదయ్యాయి. పలు కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించినట్లు సీఐ తెలిపారు. నిందితుడి నుంచి రూ.12,800 నగదును స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించారు.


