హుస్నాబాద్: మహిళల ఫొటోల మార్పింగ్‌కు పాల్పడిన విద్యుత్ శాఖ ఉద్యోగి(ఆర్టిజన్)ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. సీఐ కొండ్ర శ్రీను వివరాల ప్రకారం... హన్మకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామానికి చెందిన శ్రీబద్రి మహేశ్ పట్టణంలోని డీఈ కార్యాలయంలో ఆర్టిజన్‌గా పని చేస్తున్నాడు. తోటి ఉద్యోగుల బంధువుల స్టేటస్ ఫొటోలు, సోషల్ మీడియాలో వచ్చే ఫొటోలు సేకరించేవాడు. ఫొటో ఎడిటింగ్ ద్వారా అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తున్నాడని సిబ్బంది ద్వారా డీఈ కృష్ణయ్య తెలుసుకున్నాడు. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై లక్ష్మారెడ్డి కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి హుస్నాబాద్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించగా, అతడిని సిద్దిపేట జైలుకు తరలించారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
రాయికోడ్(అందోల్): పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ చైతన్యకిరణ్ వివరాల మేరకు... మండలంలోని సిరూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలిసి ఎస్‌ఐ దాడులు చేశారు. సిరూర్ గ్రామానికి చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.12,520, 52 పేకాట ముక్కలు, ఏడు ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక వ్యవహారాలు, పేకాట, జూదం తదితరాలపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్‌ఐ హెచ్చరించారు.
రంగంపేట శివారులో ఆరుగురు..
కొల్చారం(నర్సాపూర్): పేకాట ఆడుతున్న ఆరుగురిని మెదక్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన ఆదివారం మండలంలోని రంగంపేట గ్రామ శివారులో చోటుచేసుకుంది. మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు వివరాల ప్రకారం... గ్రామంలోని అవుసులవాని కుంటలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న కొమ్ముల రాజాగౌడ్, ఊరడి సత్యం, ఆరట్ల సురేశ్, నిమ్మనగారి చంద్రారెడ్డి, ఎండి చాంద్ పాష, అరిగె నర్సింహులు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రూ.4050 నగదుతో పాటు 6 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
రామాయంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం... నార్సింగి మండలం శంకాపూర్‌కు చెందిన పర్శ శంకర్ (42) ఈనెల 3వ తేదీన బైక్‌పై రామాయంపేటకు వచ్చి తిరిగి వెళ్తున్నాడు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదురుగా రోడ్డుకు అడ్డుగా వచ్చిన కోతులను తప్పించబోయి ప్రమాదశాత్తు బైక్‌పైనుంచి పడి తీవ్రగాయాలపాలయ్యాడు. దీంతో అతడ్ని హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం మృతి చెందాడు. మృతుడికి భార్య పద్మతోపాటు 18 ఏళ్లలోపు కుమారుడు, కూతురు ఉన్నారు.


