చోరీ కేసులో నిందితుడి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో నిందితుడి రిమాండ్‌

May 11 2026 9:49 AM | Updated on May 11 2026 9:49 AM

ములుగు(గజ్వేల్‌): ఆభరణాల చోరీ కేసులో పోలీసులు ఒకరిని అరెస్ట్‌ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఆదివారం గజ్వేల్‌ రూరల్‌ సీఐ రవిరాజు, ములుగు ఎస్‌ఐ రఘుపతితో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 9న మధ్యాహ్నం వంటిమామిడి చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఐ రఘుపతి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో చిన్నతిమ్మాపూర్‌ గ్రామ పరిసరాల్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితుడి పేరు పుత్రకొండ బాలకృష్ణ (25) అని, ఏపీ, శ్రీకాకుళం జిల్లా నులకలజోడు గుర్రండి గ్రామానికి చెందిన వాడిగా గుర్తించాడు. ప్రస్తుతం అతను మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం మజీద్‌పూర్‌లో నివాసముంటున్నాడు. అయితే శామీర్‌పేటలోని పెద్దమ్మ కాలనీకి చెందిన మడిగెల బాల్‌చందర్‌(25), జవహర్‌నగర్‌కు చెందిన ఇప్పలపల్లి నరేశ్‌(24)తో కలిసి బాలకృష్ణ బైక్‌పై ఈ నెల 4న చిన్నతిమ్మాపూర్‌ గ్రామానికి వచ్చారు. నర్సింహులు ఇంటికి వెళ్లి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న బంగారు, వెండి అభరణాలతో పాటు నగదును ఎత్తుకెళ్లి నిందితులు ఓ చోట దాచిపెట్టారు. బాలకృష్ణ మళ్లీ చోరీ చేయాలన్న ఆలోచనతో తాళం వేసిన ఇళ్లను గమనిస్తున్న క్రమంలో పోలీసులు అతన్ని పట్టుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. వెంటనే నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఇతనిపై శామీర్‌పేట, జీనోమ్‌ వ్యాలీ పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న ఇద్దరిని పట్టుకుంటామని తెలిపారు.

వివరాలు వెల్లడించిన సీఐ రవిరాజు

Advertisement
 
Advertisement
Advertisement