కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

May 11 2026 9:49 AM | Updated on May 11 2026 9:49 AM

గజ్వేల్‌రూరల్‌: కుటుంబ కలహాలతో మాజీ సర్పంచ్‌ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ సంఘటన మండలంలోని కొడకండ్లలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన తెరాల శ్రీనివాస్‌(52), విజయ దంపతులు. గతంలో విజయ గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కొంతకాలంగా హైదరాబాద్‌లోని అల్వాల్‌ ప్రాంతంలో వారు నివాసముంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ ఇటీవల ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యాడు. దీనికి తోడు కుటుంబ కలహాలతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన ఆదివారం అల్వాల్‌లోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు.

నిండు గర్భిణిపై భర్త దాడి

గర్భస్థ శిశువు మృతి

శివ్వంపేట(నర్సాపూర్‌): నిండు గర్భిణిపై భర్త దాడి చేయడంతో గర్భస్థ శిశువు మృతిచెందింది. ఈ ఘటన మండల పరిధిలోని దొంతి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి వివరాల ప్రకారం... నర్సాపూర్‌ మండలం చిన్నచింతకుంటకు చెందిన సునీతకు శివ్వంపేట మండలం దొంతి గ్రామానికి చెందిన మ్యాదరి రజనీకాంత్‌తో ఆరేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా ప్రస్తుతం సునీత 8 నెలల గర్భిణి. శనివారం ఆమెను వాళ్ల అమ్మ కాడారి నర్సమ్మ నర్సాపూర్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు తీసుకెళ్లి దొంతికి చేరుకున్నారు. ఇప్పటి వరకు ఎక్కడికెళ్లారంటూ మద్యం మత్తులో ఉన్న రజనీకాంత్‌ అత్త, భార్యను దుషించి దాడికి పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం మరోసారి అత్తపై రజనీకాంత్‌ దాడికి పాల్పడుతున్న క్రమంలో సునీత అడ్డురావడంతో పొట్ట భాగంలో బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. అంబులెన్స్‌లో నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌ నిలోఫర్‌కు తీసుకెళ్లారు. వైద్యులు నార్మల్‌ డెలివరీ చేసినప్పటికీ శిశువు మృతిచెందింది. భార్య, అత్తపై దాడికి పాల్పడిన రజనీకాంత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement