పటాన్‌చెరు టౌన్: ఖానావళి హోటల్‌లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు బాధితులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం కొద్దిసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయి, తిరిగి వచ్చిన సమయంలో ఆకస్మికంగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగినట్లు హోటల్ నిర్వాహకులు తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది వెంటనే హోటల్‌లో పనిచేస్తున్న వారిని బయటకు పంపించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. హోటల్‌లో ఉన్న మూడు గ్యాస్ సిలిండర్లలో ఒక దానిని సిబ్బంది ముందుగానే బయటకు తరలించగా, మిగిలిన రెండు సిలిండర్లు పేలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.4 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
షార్ట్ సర్క్యూట్‌తో మంటలు


