నిమ్జ్‌ ప్రాజెక్టుకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

నిమ్జ్‌ ప్రాజెక్టుకు మోక్షం

May 9 2026 9:43 AM | Updated on May 9 2026 9:43 AM

నిమ్జ్‌ ప్రాజెక్టు కోసం కేటాయించిన ప్రాంతం

జహీరాబాద్‌: దశాబ్ద కాలం తర్వాత ఎట్టకేలకు జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి(నిమ్జ్‌)కు మోక్షం లభించనుంది. ఈనెల 10న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాజెక్టు పరిధిలో చేపట్టనున్న స్మార్ట్‌ సిటీ పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. 2013లో రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న జె.గీతారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని జహీరాబాద్‌ ప్రాంతానికి నిమ్జ్‌ ప్రాజెక్టును మంజూరు చేయించారు. జహీరాబాద్‌లో ఏర్పాటు చేయతలపెట్టిన ప్రాజెక్టును సుమారు 12,635 ఎకరాల భూమిలో విస్తరించాలని నిర్ణయించారు. తదనంతరం మారిన రాజకీయ పరిణామాలతో ప్రాజెక్టు పనులు మందగించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం నిమ్జ్‌ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది.

మొదటి విడతలో 3వేల ఎకరాలకు పైగా...

ప్రాజెక్టు ఏర్పాటు నిమిత్తం మొదటి విడత కింద 3,245 ఎకరాల మేర భూసేకరణ జరిగింది. నిమ్జ్‌లో కేంద్ర ప్రభుత్వం వాటా 49%, రాష్ట్ర ప్రభుత్వం వాటా 51% వంతున పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇందుకోసం సుమారు రూ.2,369 కోట్ల నిధులతో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయల సంస్థ, నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అభివృద్ధి అమలు ట్రస్ట్‌ కలిసి పారిశ్రామిక అభివృద్ధి పనులు చేపట్టనున్నాయి. కేవలం మౌలిక సదుపాయాల కల్పన కోసమే జహీరాబాద్‌లో రూ.1,695 కోట్లు ఖర్చు చేయనున్నారు.

పలు పరిశ్రమలకు భూములు

నిమ్జ్‌ పరిధిలో పరిశ్రమల ఏర్పాటుకుగాను ముందుకు వచ్చిన యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూములను కేటాయించింది. ఈవీఎం టెక్నాలజీ సంస్థకు 511 ఎకరాలు కేటాయించారు. దీంతో సంస్థ రూ.వేయి కోట్లతో పరిశ్రమలను ఏర్పాటు చేయనుంది. ఎలక్ట్రానిక్‌ వాహనాల తయారీ సంస్థ ట్రైటాన్‌ రూ.2,100 కోట్ల పెట్టుబడితో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. హ్యూండాయ్‌ మోటారు కంపెనీ(ఈవీ ఆటో మోటీవ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌)కి 675 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సంస్థ సుమారు రూ.8,528 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా జహీరాబాద్‌ ప్రాంతంలో సుమారు 10లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించాలనేది కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.

స్మార్ట్‌ సిటీ ఏర్పాటు

10న ప్రధాని మోదీ వర్చువల్‌గాశంకుస్థాపన

రూ.రెండువేల కోట్లతోమౌలిక వసతులు

కనెక్టివిటీ పరంగా

అనుకూలమైన ప్రాంతం

జహీరాబాద్‌ భౌగోళికంగా, కనెక్టివిటీ పరంగా అనుకూలమైన ప్రాంతం. 65వ జాతీయ రహదారికి సమీపంలోని న్యాల్‌కల్‌, ఝరాసంగం మండలాల మధ్య ఈ ఇండస్ట్రియల్‌ సిటీ రూపుదిద్దుకోనుంది. హైదరాబాద్‌ నుంచి 90 కిలోమీటర్లు, విమానాశ్రయం నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల భవిష్యత్తులో జహీరాబాద్‌ ఒక మహానగరంగా విస్తరించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement