హమ్మయ్య.. కాస్త చల్లబడింది | - | Sakshi
Sakshi News home page

హమ్మయ్య.. కాస్త చల్లబడింది

May 9 2026 9:43 AM | Updated on May 9 2026 9:43 AM

నారాయణఖేడ్‌: వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో రెండు మూడు రోజులుగా భాను డు శాంతించాడు. ఈ పరిణామంతో ఎండవేడిమితో ఉక్కిరి బిక్కిరవుతున్న జనాలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. నిర్మానుష్యంగా మారిన రహదారులు ఇప్పుడు జనాలతో దర్శనమిస్తున్నాయి. ఎండలవల్ల మధ్యాహ్నం వేళ మందగించిన వ్యాపారాలు పుంజుకుంటున్నాయి. జనాలు మధ్యాహ్నం సమయంలోనూ రాకపోకలు సాగిస్తుండటంతో పట్టణాలు కళకళలాడుతున్నాయి.

మూడు రోజులు వర్షాలు!

ఎండవేడిమితో అల్లాడుతున్న జనాలకు ఊరటనిచ్చేలా వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడ్డ ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వాతావరణమార్పులతో కొన్ని రోజులుగా నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడే అవకాశముందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో వర్షాలు కురవడంతోపాటు ఉరుములు, మెరుపులతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అకాల వర్షాల నేపథ్యంలో ఉరుములు సంభవించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయట తిరగొద్దని సూచించింది.

రైతుల్లో ఆందోళన..

వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఆలస్యంగా కొనుగోళ్లు సాగుతుండగా తేమ శాతం రాలేదని ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకోవడం కత్తీమీద సాములా మారింది. ఆరుబయట ఎలాంటి రక్షణ లేకుండా ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టారు. టార్పాలిన్ల సరఫరా అంతంతమాత్రంగానే ఉంది. దీంతో రైతులే ఎరువుల బస్తాలను కుట్టుకుని పంటలపై కప్పుతున్నారు.

వాతావరణంలో మార్పులు

తగ్గిన భగభగలు

రానున్న మూడు రోజులువర్షాలు కురిసే అవకాశం

తగ్గిన వేడి..

వాతావరణ మార్పుల వల్ల గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. వారం పది రోజుల క్రితం గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి ఆపైగా ఉండగా ఒక్కసారిగా ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం సమయంలోనూ వేడి తగ్గింది. 35 నుంచి 38 డిగ్రీల సెల్సీయస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement