కూరగాయల సాగు.. ఆదాయం బాగు | - | Sakshi
Sakshi News home page

కూరగాయల సాగు.. ఆదాయం బాగు

May 9 2026 9:43 AM | Updated on May 9 2026 9:43 AM

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): కూరగాయల సాగుతో ఏడాది పొడవునా ఆదాయం వస్తున్నప్పటికీ చాలామంది రైతులు వరి సాగునే ఎంచుకుంటున్నారు. అయితే కొంతమంది రైతులు కూరగాయలు, ఆకుకూరలు పంటలు సాగు చేసి అధిక ఆదాయం సంపాదిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో వివిధ రకాల కూరగాయాలను సాగు చేస్తూ రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. మెదక్‌ జిల్లాలో కూరగాయల సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు. గతేడాది 3,100 ఎకరాల్లో కూరగాయలు సాగు చేయగా.. ప్రస్తుతం 3,250 ఎకరాల్లో రైతులు కూరగాయల సాగు చేస్తున్నారు. సంప్రదాయ పంటల కంటే తక్కువ కాలంలో, మెరుగైన ఆదాయం వస్తుండటంతో సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులు మాత్రమే కూరగాయల సాగుపై ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో సాగవుతున్న ఇతర పంటల సాగుతో పోలిస్తే.. కూరగాయల సాగు చాలా తక్కువ. ఈ కూరగాయలతో దినసరి ఆదాయం ఉన్నప్పటికీ, చాలామంది రైతులు సరైన రవాణా లేక సమయానికి కూలీలు లభించక అకస్మాత్తుగా పండించిన కూరగాయల ధర పడిపోవడం వంటి కారణాలతో రైతులు వరి వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ అధికారులు ఈ ఏడాది 700 ఎకరాలకు సరిపడా మినీ కిట్లు (కూరగాయల విత్తనాలు), 210 ఎకరాలకు సరిపోయే కూరగాయల నారును ఉచితంగా పంపిణీ చేశారు.

జైరాం తండాలో సాగు చేస్తున్న బీర

కూరగాయలు సాగు చేసేటప్పుడు పంట చేతికి వచ్చే సమయానికి ఏ కూరగాయలకు డిమాండ్‌ ఉంటుందో గుర్తించాలని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కాలానికి అనుగుణంగా పండే కూరగాయలు సాగు చేయాలన్నారు. వేసవిలో టమాట, బెండ, సోరకాయ, బీరకాయ, చిక్కుడు, కాకర వంటి కూరగాయలు సాగుచేయాలని అధికారులు చెబుతున్నారు. మట్టి పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాలకు అనుకూలమైన పంటలు చేయడంతో పాటు కూరగాయల సాగులో సైతం తరుచూ పంటమార్పిడి చేయాలన్నారు. అలాగే విత్తనశుద్ధి చేయడంతో తెగుళ్ల నివారణ అరికట్టవచ్చన్నారు. కూరగాయల సాగులో సాంకేతిక పద్ధతులు పాటిస్తే, పంట బాగుండడంతో పాటు దిగుబడి ఆధికం పెరుగుతుందన్నారు. అంతేకాదు నీటి పొదుపు కోసం డ్రిప్‌ ఇరిగేషన్‌ వాడాలన్నారు. నేలలో తేమను సంరక్షించడానికి, ముఖ్యంగా కలుపు నివారణకు, నేల ఉష్ణోగ్రతను నియంత్రిచడానికి మల్చింగ్‌ షీట్లు ఉపయోగించాలన్నారు. సరైన సస్య రక్షణ పద్ధతులు, నీటి యజమాన్యం, వేసవిలో తీసుకోవాల్సి జాగ్రత్తలతో పాటు అధికారుల సలహాలు పాటిస్తే కూరగాయల సాగుకు మించి మరొకటి ఉండదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement