సిద్దిపేటకమాన్: సిద్దిపేటలో వ్యాపారి హత్య, దొంగతనం కేసులో అరెస్టు అయిన కానిస్టేబుల్ ప్రవీణ్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలో సీసీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తూ నేరాల్లో గానీ, చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యక్రమాల్లో ఎవరూ పాల్గొన్న వారిపై చట్టప్రకారం, శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
అత్తపై అల్లుడు అత్యాచారం
● ఖాదిరాబాద్‌లో ఘటన
● నిందితుడి అరెస్టు
జోగిపేట(అందోల్): మద్యానికి బానిసై కామంతో కళ్లు మూసుకుపోయి భార్యాభర్తల మధ్య ఉన్న గొడవను సర్దిచెప్పేందుకు వచ్చిన అత్తపై సొంత అల్లుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం ఖాదిరాబాద్‌లో చోటుచేసుకుంది. సీఐ అనిల్‌కుమార్ చెప్పిన కథనం ప్రకారం..గ్రామానికి చెందిన మహ్మద్ గరీబ్ ప్రతీరోజు మద్యం తాగి భార్యతో గొడవ పడుతుండేవాడు. గురువారం రాత్రి ఘర్షణ పడుతుండగా సయోధ్య కుదుర్చేందుకు అత్త వచ్చింది. నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసింది. అప్పటికే మత్తులో ఉన్న మహ్మద్ గరీబ్...భార్యను గదిలోకి నెట్టేసి గడియపెట్టి అత్తపై అత్యాచారం జరిపి బయటకు పారిపోయాడు. ఈ విషయాన్ని అత్త బయటకు వచ్చి ఇరుగుపొరుగు వారికి తెలియజేసి వట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు గరీబ్‌ను అదుపులోకి తీసుకుని కోర్టుకు రిమాండ్‌కు పంపుతున్నట్లు సీఐ అనిల్‌కుమార్ తెలిపారు.
పాత సామగ్రి దగ్ధం
హత్నూర(సంగారెడ్డి): పాత ఇనుప సామగ్రి కొనుగోలు దుకాణం ప్రమాదవశాత్తు దగ్దమైంది. ఈ ఘటన మండలంలోని మల్కాపూర్ గ్రామ శివారులోని సంగారెడ్డి దౌల్తాబాద్ ప్రధాన రహదారి పక్కన శుక్రవారం చోటుచేసుకుంది. శుక్రవారం ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు అంటుకొని దుకాణం దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఆర్థిక నష్టం వాటిల్లినట్లు దుకాణం యజమాని తెలిపారు.


