పాపన్నపేట(మెదక్): మండుతున్న ఎండల్లో పిల్లలు బయటకు వెళ్లకుండా.. ఇంట్లోనే పురాతన పీటతో ఆడే ఓమని గుంటల (వామని) ఆట అత్యంత ప్రాచీన మైనది. తెలుగు వారి సాంప్రదాయ ఆటగా వినతికెక్కిన ఈ ఆట పిల్లల్లో ఏకాగ్రత.. గణిత నైపుణ్యాలను పెంచుతోంది. ఈ ఆటను సీతమ్మ వారు ఆడినట్లుగా చారిత్రక నేపఽథ్యం ఉంది. ఇద్దరు ఆడే ఈ ఆటలో చెక్కతో చేసిన పీటపై రెండు వరుసల్లో 14 గుంటలు ఉంటాయి. ఒక్కో గుంటలో ఐదు చింత గింజలు వేస్తూ ఆట మొదలు పెడతారు. అనంతరం నచ్చిన గుంటలోని చింత గింజలను తీసుకొని, ఒక్కో గుంటలో ఒక్కో గింజ వేస్తూ వెళ్తుంటారు. చేతిలో ఉన్న గింజలు అయిపోతే , ఆ తర్వాత గుంటలో నుంచి తీసుకొని వేయాలి. ఎక్కడైనా మధ్యలో ఖాళీ వచ్చిందంటే, దాని తర్వాత గుంటలో ఉన్న గింజలు, పంచిన వ్యక్తికి చెందుతాయి. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆడుతుండాలి. చివరికి ఎవరి దగ్గర గింజలు ఎక్కువ ఉంటే, వారే గెలిచినట్లు.ఈ ఆటను నిశితంగా గమనించడం, ఒక్కో చింత గింజ లెక్క పెట్టడం, ఖాళీ రాకుండా చూసుకోవడం వంటివి, మెదడుకు పదును పెడతాయి. వేలి కదలికలను మెరుగు పరుస్తుంది.


