ఆర్భాటంగా కేంద్రాల ఏర్పాటు
● హమాలీలు లేక రైతుల ఎదురుచూపులు
ఆరుగాలం శ్రమించి పంట చేతికొచ్చిన తర్వాత కూడా రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలోని హత్నూర పీఏసీఎస్ సొసైటీ ఆధ్వర్యంలో వారం క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా హమాలీల లేక ఇప్పటికీ కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. వారం నుంచి రైతులు తమ ధాన్యాన్ని తూకం వేసేందుకు పడిగాపులు పడుతున్నారు. ఈలోగా అకాల వర్షం పడితే ఆగమైపోతామని ఆందోళన చెందుతున్నారు.
హత్నూర (సంగారెడ్డి): హత్నూర పీఏసీఎస్ సొసైటీ ఆధ్వర్యంలో మండలంలో 16 గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు ఎమ్మెల్యే సునీతారెడ్డితోపాటు పలు గ్రామాల్లో సర్పంచులు ప్రారంభించారు. హత్నూర మండలంలోని నాగారం, సాదుల్ నగర్, లింగాపూర్, బోరపట్ల, పల్పనూరు, గ్రామాలతోపాటు ఇతర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద కూలీలు లేకపోవడంతో కుప్పలు కుప్పలుగా రైతులు తెచ్చిన ధాన్యం రాసులు దర్శనమిస్తున్నాయి. ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల వద్ద సుమారు 240 మంది కూలీలు అవసరముండగా అధికారులు వీరిని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రతీ ఏటా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీలుగా పనిచేసేందుకు బిహార్‌తోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వస్తుంటారు. ఇంకా బిహార్ నుంచి పూర్తిస్థాయిలో హమాలీలు రాకపోవడంతో కేంద్రాల వద్ద ధాన్యం తూకం వేయలేని పరిస్థితి ఏర్పడింది. అకాల వర్షం పడితే ధాన్యం తడిచిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి హమాలీలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.
రొయ్యపల్లిలో కేంద్రం ఏర్పాటు చేయాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాల ని హత్నూర మండలం రొయ్యపల్లికి చెందిన రైతులు సర్పంచ్ పోచగౌడ్‌తోపాటు కలసి ఆందో ళన చేశారు. ఇతర గ్రామాలకు తీసుకెళ్లి ధాన్యం విక్రయించాలంటే తీవ్ర ఇబ్బందిగా ఉందన్నారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ధాన్యం తెచ్చి వారం రోజులైంది
కొనుగోలు కేంద్రానికి వారం క్రితమే ధాన్యం తెచ్చాం. హమాలీలు రావడంలేదని ఎండిన ధాన్యాన్ని సైతం తూకం వేయడం లేదు. ధాన్యం పూర్తిగా ఎండింది. రోజు ధాన్యం కుప్పల వద్ద కాపలాకాయాలంటే ఇబ్బందిగా ఉంది. –సిద్దుల రాజు, నాగారం, రైతు.
300 బస్తాల ధాన్యం తెచ్చా
300 బస్తాల ధాన్యం తెచ్చాను. ఇంకా కూలీలు రావడం లేదు. ఎండిన ధాన్యం వర్షం వస్తే తడిసిపోతే నష్టపోతాం. అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి.
–శేఖర్ గౌడ్, నాగారం రైతు.


