● ఇప్పటివరకు వైద్యశాఖలో 18 వేల ఉద్యోగాలు భర్తీ ● మంత్రి దామోదర రాజనర్సింహ
నారాయణఖేడ్: మల్టీపర్పస్ ఏఎన్‌ఎం, నర్సింగ్ అధికారుల పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు వైద్య, ఆరోగ్య శాఖలో 18వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఖేడ్‌లో రూ.కోటితో నిర్మించిన బాలసదనం భవనాన్ని ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డిలతో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు మూడుచక్రాల స్కూటీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య, వైద్య, మహిళా సాధికారితకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. అంగన్‌వాడీలు, బాలసదనాలను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలను నిర్మించి ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తామని చెప్పారు. బాలసదనం బాలికలతో మంత్రి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. బాలసదనంలో ఆర్వోప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ..ఖేడ్‌లో బాలసదనం ఏర్పాటు చేసినా స్వంత భవనం లేక పడుతున్న ఇబ్బందులు పక్కా భవనం నిర్మాణంతో తీరనుందన్నారు. మహిళా, శిశు సంక్షేమం, విద్య, వైద్యంకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ప్రీప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను ప్రొత్సహిస్తున్నట్లు గుర్తు చేశారు. మున్సిపల్ ఛైర్మన్ నగేష్ షెట్కార్, డీసీసీ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాహారతి, జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి, మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి, సీడీపీఓ సుజాత, బాలసదనం సూపరింటెండెంట్ విజయ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మురళీకృష్ణ స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి దామోదర
జోగిపేట(అందోల్): ఆందోల్‌లో శ్రీ భునీలా సమేత రంగనాథ స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భూనీల సమేత శ్రీ రంగనాథ స్వామి, శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత మురళీకృష్ణస్వామి వారి కల్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణోత్సవాలకు మంత్రి దామోదర రాజనర్సింహ హాజరు కాగా, ఆయనకు ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు.


