ఐలా చైర్మన్ సుధీర్‌రెడ్డి
పటాన్‌చెరు టౌన్: పారిశ్రామికవాడల్లో భూములకు కన్వర్షన్ చార్జీలు 10 శాతం లోపు మాత్రమే తీసుకోవాలని ఐలా చైర్మన్ సుధీర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేయనున్న హిల్ట్ ఫాలసీకి పారిశ్రామికవేత్తలు వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. హిల్ట్ ఫాలసీలో అనుసరించవలసిన విధానాలతో పటాన్‌చెరు ఐలాభవన్‌లో బుధవారం పటాన్‌చెరు, రామచంద్రాపురం, ఐడీఏ బొల్లారం, జీడిమెట్ల పారిశ్రామిక వాడల పారిశ్రామికవేత్తల సంఘ సభ్యులు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు భూములు ఇవ్వాలన్నారు. కాలుష్య రసాయన పరిశ్రమలను హైదరాబాద్‌కు దూరంగా తరలించాలని చెప్పారు. మేజర్ పరిశ్రమలు కూడా తరలించుకునేందుకు ప్రభుత్వ అవకాశం కల్పించాలన్నారు. కన్వర్షన్ ఫీజు చెల్లించిన నాటి నుంచి ఎంత సమయంలోగా తాగునీరు, యూజీడీ సౌకర్యాలు ఏర్పాటు చేస్తారో ముందుగానే చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కనెక్షన్ల కోసం ఆన్‌లైన్ ద్వారా అనుమతులు వెంటనే లభించి, అధికారులు వచ్చి అమర్చేలా చేయాలన్నారు. సమావేశంలో ఐలా వైఎస్ చైర్మన్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.


